ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

KCR: 'కేసీఆర్ ఫామ్‌హౌస్‌ దున్నుతా అంటావు.. నువ్వు ట్రాక్టర్‌ డ్రైవర్‌వా ?' - సీఎం కేసీఆర్ వార్తలు

భాజపా పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పథకాల్లో ఒక్కటైనా ఉందా ? అని తెలంగాణ సీఎం కేసీఆర్​ ప్రశ్నించారు. భాజపా అనేక దొంగ లెక్కలు చేసిందని విమర్శించారు. కొన్ని కారణాల వల్ల ఎస్సీని సీఎం చేయలేకపోయానని వివరించారు. గొర్రెల పైసల్లో కేంద్ర ప్రభుత్వానిది రూపాయి ఉన్నా.. తాను రాజీనామా చేస్తా అని సవాల్ విసిరారు. ఈడీ దాడులకు దొంగలు భయపడతారు.. తామెందుకు భయపడతామని కేసీఆర్ అన్నారు. 'కేసీఆర్ ఫామ్‌హౌస్‌ దున్నుతా' అంటావు..నువ్వు ట్రాక్టర్‌ డ్రైవర్‌వా ? అని భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్​ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పండే ధాన్యాన్ని కేంద్రం కొనే వరకూ వదిలేదే లేదని స్పష్టం చేశారు. వడ్లు కొనాలని ఈనెల 12న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు చేస్తామని చెప్పారు.

'కేసీఆర్ ఫామ్‌హౌస్‌ దున్నుతా అంటావు.. నువ్వు ట్రాక్టర్‌ డ్రైవర్‌వా ?'
'కేసీఆర్ ఫామ్‌హౌస్‌ దున్నుతా అంటావు.. నువ్వు ట్రాక్టర్‌ డ్రైవర్‌వా ?'

By

Published : Nov 8, 2021, 7:56 PM IST

'కేసీఆర్ ఫామ్‌హౌస్‌ దున్నుతా అంటావు.. నువ్వు ట్రాక్టర్‌ డ్రైవర్‌వా ?'

తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​పై (Bandi Sanjay) సీఎం కేసీఆర్ (CM KCR)​ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 'మిస్టర్‌ బండి సంజయ్‌.. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడు' అంటూ హెచ్చరించారు. తన నియోజకవర్గంలో ఫామ్‌హౌస్‌ ఉందని అక్కడికెళ్తే తప్పా అంటూ నిలదీశారు. 'ఎస్సీని సీఎం చేస్తానన్నా.. చేయలేదు.. అది వాస్తవమే. నిజమే.. కొన్ని కారణాల వల్ల ఎస్సీని సీఎం చేయలేకపోయా. ఎస్సీని సీఎం చేయకుండానే రెండోసారి సీఎం అయ్యాను. ఎస్సీని సీఎం చేయని నా నిర్ణయాన్ని ప్రజలు ఆమోదించారు.' అని సీఎం కేసీఆర్ వివరించారు.

ఒక్క రూపాయి ఉన్నా...

గొర్రెల పైసల్లో కేంద్ర ప్రభుత్వానిది రూపాయి ఉన్నా..తాను రాజీనామా చేస్తా అని కేసీఆర్ (CM KCR) సవాల్ విసిరారు. గొర్రెల కోసం రుణం తీసుకున్నాం.. బాధ్యతగా తీరుస్తున్నామన్నారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పథకాల్లో ఒక్కటైనా ఉందా ? అని ప్రశ్నించారు. భాజపా అనేక దొంగ లెక్కలు చేసిందని...కర్ణాటకలో భాజపా దొడ్డిదారిన ప్రభుత్వంలోకి వచ్చిందని విమర్శించారు. మధ్యప్రదేశ్‌లో భాజపా గెలవలేదని.. దొడ్డిదారిన సర్కారు నడుస్తోందని పేర్కొన్నారు. అప్రజాస్వామికంగా ప్రభుత్వాలను కూల్చిన పార్టీ భాజపా అని మండిపడ్డారు. ప్రశ్నించేవారిపై ఐటీ, ఈడీ దాడులు చేయించడం భాజపా నైజం అంటూ చురకలు అంటించారు.

అది జోక్‌ ఆఫ్‌ ద మిలీనియం

'మేం లక్షా 35 వేల ఉద్యోగాలు ఇచ్చాం.. మరో 70వేలు ఇవ్వబోతున్నాం. జోనల్‌ చట్టం తీసుకొచ్చాం.. ఉద్యోగులను సర్దుబాటు చేస్తున్నాం. జోనల్‌ విధానం అమలు కారణంగా కాస్త ఆలస్యమవుతోంది.. మేం చేయగలిగిందే చెబుతాం. కేంద్రం.. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలని చెప్పి ఉన్న ఉద్యోగాలే ఊడగొట్టింది. కేసీఆర్‌ తెలంగాణకు ఏం చేశారన్నది జోక్‌ ఆఫ్‌ ద మిలీనియం. తెలంగాణ పథకాలను పార్లమెంటులోనే మెచ్చుకున్నారు. తెలంగాణ ప్రగతిని ఆర్‌బీఐ కూడా మెచ్చుకుంది. తెలంగాణ సాధించిన ప్రగతిని ఏ భాజపా రాష్ట్రమైనా సాధించిందా?'

- కేసీఆర్, తెలంగాణ సీఎం

కిషన్‌రెడ్డి పారిపోయారు

తాము ఎన్నోసార్లు రాజీనామాలు విసిరికొట్టినట్లు కేసీఆర్ (CM KCR) స్పష్టం చేశారు. అలాంటిది పదవులకు భయపడతామా ? అన్నారు. ఉద్యమ సమయంలో భాజపాకు లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు.. కిషన్‌రెడ్డి పారిపోయారని విమర్శించారు. 'పదవులను చిత్తు కాగితాల్లా విసిరికొట్టాం.. మేం దద్దమ్మలమా ? ప్రపంచ ఉద్యమాలకే పాఠం చెప్పిన ఘనత తెలంగాణ ఉద్యమానిది' అని కేసీఆర్ అన్నారు.

వరి కొనే వరకూ వదిలేదు లేదు..

తెలంగాణలో పండే ధాన్యాన్ని కేంద్రం కొనే వరకూ వదిలేదే లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పండే ధాన్యం కొనకుంటే..మీ విధానం ఏంటో చెప్పండని ప్రశ్నించారు. వడ్లు కొనాలని ఈనెల 12న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు చేస్తామని చెప్పారు. తాము పిలుపు ఇచ్చిన ధర్నాలో బండి సంజయ్‌ పాల్గొంటారా ? అని ప్రశ్నించారు. యాసంగిలో వరి వేయొద్దని రైతులకు మరోసారి సూచించారు. సీడ్‌ కంపెనీలు, మిల్లర్లతో ఒప్పందం ఉన్న రైతులు యాసంగిలో వరి పండించుకోవచ్చని చెప్పారు. తెలంగాణ పత్తికి ప్రపంచ మార్కెట్‌లో డిమాండ్‌ ఉందని వెల్లడించారు.

నాది ఫామ్‌హౌస్‌ కాదు!

'ఈడీ దాడులకు దొంగలు భయపడతారు.. మేమెందుకు భయపడతాం. కేసీఆర్ ఫామ్‌హౌస్‌ దున్నుతా అంటావు.. నువ్వు ట్రాక్టర్‌ డ్రైవర్‌వా? నాది ఫామ్‌హౌస్‌ కాదు. ఫార్మర్‌ హౌస్. మాకేం మనీ ల్యాండరింగులు.. బోండరింగులు లేవు. మాకెలాంటి వ్యాపారాలు.. దందాలు లేవు.. మమ్మల్నేం చేయలేరు. అనవసర ప్రయత్నాలు చేస్తే బూమరాంగ్‌ అవుతుంది జాగ్రత్త. నేను సూట్‌కేసులు ఇచ్చానా?.. సూట్‌కేసులు ఇచ్చింది మీరే. దేశంలో ఎన్నికల్లో అధికంగా డబ్బులు ఖర్చు పెట్టే పార్టీ భాజపానే.'

-కేసీఆర్, తెలంగాణ సీఎం

మంత్రివర్గంలో అందరూ ఉద్యమకారులే ఉంటారా ?

తెలంగాణ ఆవిర్భావం తర్వాత తమది ఫక్తు రాజకీయ పార్టీ అని స్పష్టంగా చెప్పినట్లు సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. రాజకీయ చాణక్యం.. చాకచక్యం చూపిస్తామని కుండబద్దలు కొట్టి మరీ చెప్పినట్లు తెలిపారు. ఇతర పార్టీల నుంచి నాయకులను తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇతర పార్టీ నాయకులను మంత్రివర్గంలోకి తీసుకుంటే తప్పేముందని ప్రశ్నించారు. జ్యోతిరాదిత్య సింధియాను భాజపాలోకి తీసుకుని మంత్రి పదవి ఎలా ఇచ్చారని నిలదీశారు. భాజపా చేస్తే సంసారం.. ఇతర పార్టీలు చేస్తే వ్యభిచారమా ? అంటూ విమర్శించారు. మంత్రివర్గంలో అందరూ ఉద్యమకారులే ఉంటారా ? అన్ని వర్గాలకూ ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. 20 ఏళ్లు పదవిలో ఉంటానన్న చంద్రబాబును పిడికెడు మందితో ఢీకొన్నానని పేర్కొన్నారు. తాను ఎంతో మంది ఎంపీలు, ఎమ్మెల్యేలను సృష్టించానని కేసీఆర్‌ వెల్లడించారు.

దేశ ద్రోహులు ఎవరో తేలుద్దాం రా...

దేశాన్ని కాపాడమని చెప్పాం.. అది తప్పా ? అని కేసీఆర్ ప్రశ్నించారు. మన భూభాగం కాపాడుకోవాలని చెప్పడం దేశ ద్రోహమా ? అన్నారు. దేశాన్ని కాపాడమన్నోడు దేశద్రోహా.. దేశాన్ని వదిలేసినోడు దేశద్రోహా ? అని ప్రశ్నించారు. దేశ ద్రోహులు ఎవరో తేలుద్దాం ముందుకు రావాలని చెప్పారు. ట్రైబ్యునల్ వచ్చే వరకు తాత్కాలిక పద్ధతిలో నీటి కేటాయింపులకు అంగీకరించినట్లు వెల్లడించారు. హరీశ్‌రావు మంత్రిగా ఉన్నప్పుడు సమావేశానికి వెళ్లాలని తానే చెప్పినట్లుగా వివరించారు. ఏడు మండలాలను ఏపీలో కలిపినప్పుడు భాజపా నాయకులు ఎక్కడ పడుకున్నారని ప్రశ్నించారు. ప్రధాని రాష్ట్రానికి శాశ్వత ద్రోహం చేసినప్పుడు ఎక్కడున్నారని నిలదీశారు.

పెట్రోల్​పై సెస్‌ మొత్తం ఉపసంహరించుకోవాలి

'కరోనా వేళ ప్రైవేటు పాఠశాలల సిబ్బందిని ఆదుకున్నది తెలంగాణ మాత్రమే. స్వాతంత్ర్య పోరాటం తర్వాత అతిపెద్ద విషాదం కరోనా వలస కూలీల మరణాలు. మా సర్కారు వలస కూలీలను ఆదుకుంది.. రైళ్లు పెట్టి సొంత ప్రాంతాలకు పంపింది. ప్రజలపై ప్రేమ ఉంటే.. పెట్రోల్​పై సెస్‌ మొత్తం ఉపసంహరించుకోవాలి. కేంద్రం సెస్‌ ఉపసంహరించుకుంటే లీటర్‌ పెట్రోల్‌ రూ.70కే వస్తుంది.. మీరు సిద్ధమా? కేంద్రం విధించిన సెస్‌ తగ్గించకుండా రాష్ట్రాలపై పడి ఏడవటమేంటి? దేశంలో విలేకరులకు రూ.100 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందా? న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందా? ఎక్కడో ఒక ఎన్నిక ఓడిపోగానే మేం కంగారు పడిపోం.' -కేసీఆర్ తెలంగాణ సీఎం

ఇదీ చదవండి

CM KCR: నాకు సమాధానం కావాలి...అప్పటివరకు భాజపాను వదిలిపెట్టను: కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details