ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పోలవరానికి నేరుగా జర్మనీ హైడ్రాలిక్ సిలిండర్ల రాక - polavaram latest news

పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన హైడ్రాలిక్ సిలిండర్లను నేరుగా పోలవరానికే రప్పించేందుకు జలవనరుల శాఖ ఏర్పాట్లు చేస్తుంది. సాధారణంగా ఉన్నతాధికారులు, గుత్తేదారు ప్రతినిధి బృందం జర్మనీ వెళ్లి వాటిన తనిఖీ చేసి అమోదించాలి. కానీ కరోనా నేపథ్యంలో సిలిండర్లు ఇక్కడికే తెప్పిస్తున్నారు.

Hydralic cylinders brought from Germany to Polavaram
నేరుగా జర్మనీ హైడ్రాలిక్ సిలిండర్ల రాక

By

Published : Jul 6, 2020, 10:37 AM IST

పోలవరం ప్రాజెక్టులో స్పిల్‌ వే గేట్ల నిర్వహణకు అవసరమైన హైడ్రాలిక్‌ సిలిండర్లను నేరుగా పోలవరానికే రప్పించేందుకు జల వనరులశాఖ ఏర్పాట్లు చేస్తోంది. సిలిండర్లను సరఫరా చేసే కంపెనీ వాటిని పోలవరం ప్రాజెక్టు వద్దే పరీక్షించి చూపాలి. ఆ తర్వాతే వాటిని తీసుకునేలా చూస్తున్నారు. పోలవరంలో గేట్లు ఎత్తడం, దించడంలో హైడ్రాలిక్‌ సిలిండర్లదే కీలకపాత్ర. అవి జర్మనీ నుంచి రావాలి. సాధారణంగా అయితే పోలవరం ఉన్నతాధికారులు, గుత్తేదారు ప్రతినిధి బృందం జర్మనీ వెళ్లి వాటిని తనిఖీ చేసి ఆమోదించాలి.

కానీ కరోనా నేపథ్యంలో దీన్ని నిలిపివేసి, సిలిండర్లు ఇక్కడికే తెప్పిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను గోదావరి వరద సమయంలోనూ కొనసాగించేలా ప్రణాళికలు రూపొందించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే కరోనా, ఇతర కారణాలతో ప్రాజెక్టులో ఆశించిన ప్రగతి సాధ్యం కాలేదు. ఇంతలో గోదావరిలో ప్రవాహాలు పెరిగాయి. 10 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద వస్తే స్పిల్‌ వే మీదుగా నీళ్లు ప్రవహిస్తాయి. ఆలోపు వరద నేరుగా గోదావరిలోనే సాగిపోతుంది. ఆగస్టులో 7-14 లక్షల క్యూసెక్కుల వరకు ప్రవాహాలు ఉంటాయని అంచనా.

అందువల్ల ఆగస్టులో తప్ప మిగిలిన రోజుల్లో స్పిల్‌ వేలో పనులు చేసుకునేలా ప్రణాళికలు రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం స్పిల్‌ వే స్తంభాలు 51 మీటర్ల వరకు పూర్తి కానున్నందున వరద సమయంలోనూ ఆగస్టులో తప్ప పనులు చేయవచ్చని చెబుతున్నారు. స్పిల్‌ ఛానల్‌ కాంక్రీటు పనులు మాత్రం వరదల్లోపు పూర్తయ్యే అవకాశాలు తక్కువే. స్పిల్‌ ఛానల్‌లో 40% వరకు కాంక్రీటు పని మిగిలిపోవచ్చు. వరద తగ్గాకే ఆ పనులు చేయాలి. గేట్ల ఏర్పాటు ప్రక్రియ వచ్చే ఏడాది మే నెలలోనే ప్రారంభించనున్నారు. కాఫర్‌ డ్యాం పనులు, ప్రధాన డ్యాం పనులు డిసెంబర్‌ తర్వాతే ప్రారంభిస్తారు.

ఇదీ చదవండి: రెండు పదవులు.. నాలుగు పేర్లు.. నెలాఖరులో మంత్రి వర్గ విస్తరణ!

ABOUT THE AUTHOR

...view details