ప్రపంచంలో అత్యుత్తమ ఫొటోగ్రాఫర్ ఎవరు..? అంటే.. మనలో చాలా మంది ఠక్కున ట్రాఫిక్ పోలీసులని చెబుతుంటారు. ఎక్కడ పడితే అక్కడ ఫొటోలు తీసి చలాన్లు విధిస్తుంటారని వాపోతుంటారు. ఇలాంటి తరుణంలోనే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వినూత్నంగా అడుగు ముందుకేశారు. ఇదంతా మీ జాగ్రత్త కోసమేనని... ఆ తప్పుల్ని మళ్లీ పునరావృతం కాకుండా చూసుకుంటారనే జరిమానాలు విధిస్తున్నామని సామాజిక మాధ్యమాల్లో అవగాహన కల్పిస్తున్నారు. గతంలో చలాన్లు విధించినా మారకుండా ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వాహనదారుల ఉదంతాలను వివరిస్తూ మేల్కొలిపే ప్రయత్నం చేస్తున్నారు.
ట్రాఫిక్ పోలీసులు
By
Published : Jul 7, 2021, 1:24 PM IST
ముగ్గురిలో ఇద్దరు
ఇక్కడ చిత్రంలో కనిపిస్తున్న పల్సర్‌పై వెళ్తున్న ముగ్గురు ట్రాఫిక్ పోలీసుల కెమెరాకు నంబర్ ప్లేట్ కనిపించకుండా చేయి అడ్డుపెట్టారు. తీరా చూస్తేనేమో.. మాదాపూర్ దుర్గం చెరువు వద్ద మద్యం తాగి అతి వేగంగా వచ్చి డివైడర్‌ని ఢీకొట్టారు. గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఈ వాహనంపై ఎనిమిది చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి.
కుమారుడు మారం చేయడంతో తల్లిదండ్రులు ఖరీదైన బైక్‌ను కొనిచ్చారు. పరిమితికి మించి వేగంగా నడపినట్లు స్పీడ్ గన్‌ద్వారా గుర్తించి రూ.2వేల వరకు జరిమానా విధించారు. అయినా.. ఎలాంటి మార్పు లేదు. అదే వేగానికి గచ్చిబౌలి నానక్‌రాంగూడ వద్ద డివైడర్‌ని ఢీకొని ప్రాణాలు విడిచాడు.
కూకట్‌పల్లికి చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి పలుమార్లు హెల్మెట్ లేకుండా, యూటర్న్ కోసం వ్యతిరేక దిశలో వెళ్తూ పోలీసుల కంటికి చిక్కాడు. 12 జరిమానాలు నమోదయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో కూకట్‌పల్లి వద్ద జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నాడు.
చేవెళ్ళకు చెందిన ఓ వాహనదారుడు హెల్మెట్ లేకుండా బండి నడుపుతూ అదుపు తప్పి రోడ్డు పక్కన పడిపోయాడు. తలకు తీవ్ర గాయాలై మృతి చెందాడు.
గతేడాది రూ.178.35 కోట్లు...
ట్రాఫిక్ ఉల్లం‘ఘనుల’పై పలు రకాలుగా జరిమానా విధిస్తున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది తనిఖీల్లో గుర్తించడం, సీసీ కెమెరాల ద్వారా, న్యాయస్థానాల ఆదేశాలు, సామాజిక మాధ్యమాల్లో అందిన ఫిర్యాదుల మేరకు గతేడాది సైబరాబాద్ పోలీసులు రూ.178.35 కోట్ల జరిమానా విధించారు. 2019తో పోలిస్తే 2020లో కేసుల సంఖ్య 21 లక్షలు పెరిగింది. గతేడాది విధించిన 47.83 లక్షల చలాన్లలో 45.07 లక్షలు సీసీ కెమెరాల ద్వారానే గుర్తించారు.
ప్రమాదాలు పెరుగుతుండటంతో...
రోజురోజుకీ ప్రమాదాలు పెరుగుతుండటంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. ట్రాఫిక్ చలాన్లు విధించినా తప్పు తెలుసుకోకుండా మరింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే వినూత్నంగా అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ప్రమాదం జరిగినప్పుడు సీసీటీవీ ఫుటేజీ, ఆ వాహనంపై అప్పటి వరకు జరిమానాల వివరాలను సేకరించి సుమారు నిమిషం వ్యవధి ఉండేలా వీడియోలు రూపొందిస్తున్నారు. వీటిని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ తదితర సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నట్లు ట్రాఫిక్ డీసీపీ ఎస్‌ఎం విజయ్‌కుమార్ తెలిపారు.
ఇదీ చూడండి:phone number: నా ఫోన్ నంబర్ నాకు ఇస్తారా? చావమంటారా?!