కరోనాను ఎదుర్కొవడానికి తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ అమలులో పోలీసులదీ ప్రధాన పాత్ర. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 6 లక్షలకు పైగా వాహనాలకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. సుమారు 70 వేల వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనల అమలులో కఠినంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు తమలోని దాతృత్వాన్ని చాటుతున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి... రహదారులపై ఆకలితో అలమటిస్తున్న అన్నార్తుల కడుపు నింపుతున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో పనిచేస్తున్న పోలీసులు తామే సొంతంగా డబ్బులు వేసుకుని రోజూ అన్నదానం చేస్తున్నారు. స్వయంగా అన్నం, కూరలు వండి ప్యాకింగ్ చేసి రహదారుల పక్కన ఉండే వాళ్లకు అందిస్తున్నారు.
ఉదయం 6 గంటల నుంచే ఏర్పాట్లు
హైదరాబాద్ ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్ ఎదురుగా, పబ్లిక్ గార్డెన్స్‌లో రోజూ... వందల సంఖ్యలో కూలీలు రహదారుల పక్కన అన్నం కోసం ఎదురుచూస్తుంటారు. ఎవరైనా దాతలు రాగానే అన్నం కోసం పరుగులు పెట్టే దృశ్యాన్ని గమనించిన ట్రాఫిక్ పోలీసులు... వారి ఆకలి తీర్చేందుకు నడుం కట్టారు. నిత్యం విధుల్లో తలమునకలై ఉండే పోలీసన్నలు... అన్నదానం కోసం సమయం కేటాయించుకున్నారు. రోజు ఉదయం 6 గంటల నుంచే ఏర్పాట్లు చేసుంకుంటున్నారు. కూరగాయల కొనుగోలు నుంచి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వంట గది శుభ్రంగా ఉంచడంతో పాటు.. వ్యక్తిగత శుభ్రత పాటిస్తున్నారు. అన్నం, కూర వండి వాటిని ప్యాకింగ్ చేసి పెట్టుకుంటారు. మధ్యాహ్న సమయానికి వాటిని పంపిణీ చేస్తారు.