Telangana Bags First Place in JEE Mains : జేఈఈ మెయిన్ తొలి విడతలో హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ కళాశాలలో చదివిన విద్యార్థి ఒకరు 300కి 300 మార్కులు సాధించనున్నట్లు తెలిసింది. జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) ఇటీవల విడుదల చేసిన ప్రాథమిక కీ ప్రకారం చూస్తే 300 మార్కులు పొందనున్నారు. ఆ విద్యార్థి జూన్ 24న ఉదయం పూట పరీక్ష రాశారు.
గత ఏడాది మొత్తం నాలుగు సార్లు జేఈఈ మెయిన్ జరగ్గా.. 100 శాతం మార్కులు సాధించిన 18 మందికి ప్రథమ ర్యాంకు ఇచ్చారు. ఈ దఫా రెండు సార్లు మాత్రమే నిర్వహిస్తుండగా.. రెండింట్లో వచ్చిన ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకొని ర్యాంకులు కేటాయిస్తారు. తొలి విడత పరీక్ష ప్రాథమిక కీపై అభ్యంతరాల వ్యక్తీకరణ గడువు సోమవారం సాయంత్రానికి ముగిసింది. దాంతో ఈ వారంలోనే పరీక్ష పర్సంటైల్‌ను ఎన్‌టీఏ వెల్లడించనుంది.
జవాబులు గుర్తించడం లేదని ఆందోళన..ఇటీవల తొలి విడత పేపర్-1 పరీక్ష ప్రాథమిక కీను విడుదల చేయడమే కాకుండా విద్యార్థులు ఏఏ ప్రశ్నలకు జవాబులు గుర్తించారో తెలుసుకునే రెస్పాన్స్ పత్రాల(ఓఎంఆర్ తరహా)ను ఎన్‌టీఏ వెబ్‌సైట్లో ఉంచింది. అయితే మొత్తం 75లో 65 ప్రశ్నలను గుర్తించగా.. రెస్పాన్ పత్రంలో మాత్రం 30కి మాత్రమే సమాధానాలు గుర్తించినట్లు చూపుతోందని విద్యార్థి ఒకరు తెలిపారు. ఇలా తెలిపిన వారిలో ఎక్కువ మంది జూన్ 24వ తేదీన ఉదయం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్ష రాసిన వారు కావడం గమనార్హం.