ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Hyderabad Regional Ring Road: ఆర్‌ఆర్‌ఆర్‌పై అధ్యయనం ఎప్పుడో?

హైదరాబాద్ ప్రాంతీయ రింగు రోడ్డు ఉత్తర భాగం తుదిమార్గం ఖరారు కసరత్తు ముందుకు సాగడం లేదు. గుత్తేదార ఖరారైనా ఇప్పటికీ పనులు మొదలు కాకపోవడం గమనార్హం.

hyderabad-regional
hyderabad-regional

By

Published : Aug 10, 2021, 12:19 PM IST

హైదరాబాద్‌ ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం తుదిమార్గం (అలైన్‌మెంట్‌) ఖరారు కసరత్తు ముందుకు సాగడంలేదు. గుత్తేదారును ఖరారు చేసినా అధ్యయనానికి అంకురార్పణ చేయని పరిస్థితి. ప్రస్తుత అవుటర్‌ రింగు రోడ్డుకు ఆవల సుమారు 340 కిలోమీటర్ల మేర ప్రాంతీయ రింగు రోడ్డు నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. తొలిదశ కింద సంగారెడ్డి-నర్సాపూర్‌-తూప్రాన్‌-గజ్వేల్‌-యాదగిరిగుట్ట-చౌటుప్పల్‌ వరకు 158 కిలోమీటర్ల ఉత్తర భాగానికి భారత్‌మాల పరియోజన పథకం కింద కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అనుమతి మంజూరు చేసింది.

తాత్కాలిక జాతీయ రహదారి నంబరు 161 (ఎ, ఎ)ను కేటాయించింది. తుది మార్గాన్ని ఖరారు చేసేందుకు పూర్తిస్థాయి నివేదిక కేంద్రమే తయారు చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించి మహారాష్ట్రకు చెందిన కె అండ్‌ జె ప్రాజెక్ట్సు సంస్థ టెండరు దక్కించుకుంది. సవివర నివేదికను ఈ సంస్థ పది నెలల్లో రూపొందిస్తుందని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ గత నెలలో పార్లమెంటులో ప్రకటించారు. గుత్తేదారు ఖరారైన నేపథ్యంలో ఈ నెల తొలివారంలో ఆ సంస్థ ప్రతినిధులు క్షేత్రస్థాయి పరిశీలన పనులు చేపడతారని రాష్ట్ర అధికారులు అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వం గతంలో తయారు చేయించిన ప్రాథమిక నివేదిక ప్రతులను పరిశీలన కోసం గుత్తేదారు సంస్థకు అందచేశారు. అయితే ఇప్పటి వరకూ ఆ సంస్థ పనులు ప్రారంభించకపోవడంతో ఉత్తర భాగం అధ్యయనం పది నెలల్లో పూర్తవుతుందా? అన్నది ప్రశ్నార్థకంగా ఉంది. ఇప్పటి వరకు ఆ ప్రక్రియ ఎందుకు ప్రారంభం కాలేదన్నది అంతుపట్టకుండా ఉంది.

ఇదీ చూడండి: 'పెగసస్​'పై విచారణ ఈనెల 16కు వాయిదా

ABOUT THE AUTHOR

...view details