ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని దట్టమైన అటవీ ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా సాగు చేస్తున్న గంజాయి.. హైదరాబాద్‌తో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు సరఫరా అవుతోంది. ఏజెన్సీ ప్రాంతం నుంచి భారీ వాహనాల్లో గంజాయిని సరఫరా చేస్తున్న ముఠాలు.. హైదరాబాద్ మీదుగా పుణె, నాందేడ్, ముంబయి, అహ్మద్ నగర్, బెంగళూర్, రాయిచూర్, బీదర్‌కు తరలిస్తున్నారు. కూరగాయలు, ఇతర సరకులు తీసుకెళ్లే వాహనాల్లో పోలీసులకు అనుమానం రాకుండా గంజాయి సంచులను ఉంచుతున్నారు. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేసినా సరుకులు, కూరగాయలు మాత్రమే కనిపిస్తాయి. అడుగున మాత్రం గంజాయి సంచులుంటాయి. వాహనాల్లోని క్యాబిన్లలోనూ అడుగున ప్రత్యేక అల్మారాలు ఏర్పాటు చేసి వాటిలో గంజాయి ఉంచి సరఫరా చేస్తున్నారు.
300 కిలోల గంజాయి పట్టివేత
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని అడవుల్లో ఈ గంజాయి సాగు చేసి.. ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు పెరగడంతో ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. గంజాయి సాగు, సరఫరా, విక్రయాలపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులు, రెవెన్యూ, ఎక్సైజ్ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో గత నెల రోజులుగా పోలీసులు గంజాయిని అడ్డుకునేందుకు ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. పోలీస్ స్టేషన్ల వారీగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి.. గంజాయిపై నిఘా పెట్టేలా బాధ్యతలు అప్పగించారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. నర్సీపట్నం నుంచి మహారాష్ట్రలోని అహ్మద్ నగర్‌కు డీసీఎంలో తరలిస్తున్న 300కిలోల గంజాయిని ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు ముసారాంబాగ్‌లో పట్టుకున్నారు. నిందితుల ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వాటిని విశ్లేషిస్తున్నారు. ఈ ముఠా వెనక ఇంకెవరెవరూ ఉన్నారనే విషయాన్ని ఆరా తీస్తున్నారు.
ఆపరేషన్ గంజాయి
ముసారాంబాగ్, మలక్‌పేట్ ప్రాంతాల్లో వాహనం గుర్తించాం. రూ.30 లక్షల విలువైన 300 కిలోల గంజాయి పట్టుకున్నాం, రూ.30 లక్షల విలువైన గంజాయి పట్టుకున్నాం. ఈ కేసులో రెండు చరవాణులు స్వాధీనం చేసుకున్నాం. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు గంజాయి సరఫరా జరుగుతోంది.డ్రైవర్లు గంజాయిని తస్కరించి విక్రయిస్తున్నట్లు తేలింది. జహీరాబాద్‌లోని కొందరు డ్రైవర్లకు సంబంధాలున్నట్లు తేలింది. గత నెల నుంచి ఆపరేషన్ గంజాయి నిర్వహిస్తున్నాం. ఒడిశాలో యువత ఎక్కువగా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. చర్యలు తీసుకోవాలని ఒడిశా డీజీపీకి లేఖ రాశాం. - అంజనీకుమార్, హైదరాబాద్ సీపీ.
కిలో 10వేల చొప్పున..
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని దూల్పేట్, మంగళ్‌హాట్, గోల్కొండ, మణికొండ, లంగర్ హౌజ్, సింగరేణి కాలనీ, తార్నాక, లాలాగూడ, సికింద్రాబాద్, అంబర్ పేట్, నాంపల్లిలోని పలు కాలనీల్లో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. ఇది వరకు గుడుంబాకు పేరెన్నికగన్న దూల్పేట్లో ఇప్పుడు గంజాయి విక్రయాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. గుడుంబాపై ఎక్సైజ్ శాఖ కఠినంగా వ్యవహరించడంతో దానిపై ఆధారపడ్డ వాళ్లు గంజాయి విక్రయాల వైపు మళ్లారు. దూల్‌పేటకు చెందిన కొంత మంది విశాఖ ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయిని కిలో వేయి రూపాయలకు కొనుగోలు చేసి... నగరానికి తీసుకొస్తున్నారు. ఇక్కడ కిలో 10వేల చొప్పున విక్రయిస్తున్నారు. దూల్పేటలో గంజాయి విక్రయాలపై ఆరోపణలు ఎదుర్కొన్న మంగళ్ హాట్ ఇన్స్పెక్టర్ రణవీర్ రెడ్డి, ఎస్సై రామునాయుడు, షాహినాయత్ గంజ్ ఎస్సై వెంకటకృష్ణను సీపీ అంజనీ కుమార్ సస్పెండ్ చేశారు.