అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 54వ రోజూ ఉద్ధృతంగా సాగాయి. వెలగపూడిలో రవిచంద్ర, శ్రీకర్ అనే విద్యార్థులు చేపట్టిన 151 గంటల నిరాహార దీక్ష ఐదో రోజూ కొనసాగింది. యువకుల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. రక్తపోటు, చక్కెర స్థాయి పడిపోయాయని వైద్యపరీక్షల్లో తేలింది. వారి తల్లిదండ్రులు, బంధువులు, రైతులు, మహిళలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వైద్యం పొందాలని సూచించినా అందుకు యువకులు ఒప్పుకోలేదు. యువకుల పరిస్థితికి ప్రభుత్వమే కారణమని రైతులు, మహిళలు రోడ్లపైకి వచ్చి ధర్నా చేశారు. వర్షాన్ని లెక్కచేయకుండా రోడ్డుపైనే బైఠాయించారు. మందడం, పెదపరిమి సహా రాజధాని గ్రామాల నుంచి రైతులు దీక్షా శిబిరం వద్దకు చేరుకొని సంఘీభావం తెలిపారు.
వెలగపూడిలో రైతులు చేపట్టిన దీక్షకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు, తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు మద్దతు తెలిపారు. 151 గంటల నిరాహార దీక్ష చేపట్టిన యువకులను పరామర్శించారు. రాజధాని పోరు సుదీర్ఘ ఉద్యమంగా మారే సమయం ఆసన్నమైందని నారాయణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన రైతులు యువకుల దీక్షకు మద్దతు ప్రకటించారు. మందడంలో దీక్షకు కూర్చున్న రైతులకు ప్రవాసాంధ్రులు, చిన్నారులు మద్దతు తెలిపారు. కృష్ణాయపాలెంలో రైతులు, మహిళలు వినూత్న నిరసన చేపట్టారు. రాజధానిపై ముఖ్యమంత్రి జగన్ మనసు మారాలంటూ క్రైస్తవ కీర్తనలు పాడుతూ ర్యాలీ నిర్వహించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ చర్చిలో ప్రార్థనలు చేశారు.