రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ... తమ ఆయుష్షు కూడా పోసుకుని బతకాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అల్లారు ముద్దుగా పెంచుకుందామనుకున్న తమ పసి ప్రాణాన్ని అరుదైన వ్యాధి పట్టి పీడుస్తుంటే అల్లాడిపోతున్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించినదంతా ఖర్చు చేసినా.. నయంకాని రోగం... పసి ప్రాణం పాలిట యమపాశంలా మారింది. మింగలేక.. నడవలేక అల్లాడిపోతున్న తమ బిడ్డను చూసి తల్లడిల్లిపోతున్నారు. వైద్యం కోసం కావాల్సిన రూ.16 కోట్ల కోసం దాతల సాయం అర్థిస్తున్నారు. మనసున్న మారాజులు తోచినంత సాయం చేయాలని వేడుకుంటున్నారు.
పుట్టినప్పటి నుంచే
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన యోగేష్ గుప్తా, రూపాల్ గుప్తా ఉద్యోగ రీత్యా పదేళ్ల కిందట హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారు. హైదరాబాద్ లింగంపల్లిలోని నలగండ్లలో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు 2018లో కుమారుడు జన్మించాడు. అయాన్ష్ పుట్టినప్పటి నుంచి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో సికింద్రాబాద్‌లోని రెయిన్ బో చిల్డ్రెన్ ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు. ఆ పిల్లవాడు వెన్నెముక కండరాల క్షీణత టైప్-1 వ్యాధితో బాధపడుతున్నాడని వైద్యులు తేల్చి చెప్పారు.
ఒక్క ఇంజెక్షన్‌తో
ప్రపంచంలో దానికి ఏకైక చికిత్స జీన్ రీప్లేస్‌మెంట్ థెరపీ, జోల్గన్ ఎస్‌ఎమ్‌ఏ ఔషధంతోనే సాధ్యమని తెలిపారు. అమెరికాలో అందుబాటులో ఉన్న ఈ ఒక్క ఇంజెక్షన్ ధర... రూ.16 కోట్లు ఉంటుందని చెప్పడంతో ఆ తల్లితండ్రుల గుండెలు ఆగినంత పనైంది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన తమకు అంత డబ్బు ఎలా సర్దుబాటు చేయాలో... తమ పసివాణ్ని ఎలా కాపాడుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.
సాయం కోసం క్రౌడ్ ఫండింగ్
ఇంత డబ్బు ఏ ఒక్కరు సాయం చేస్తే కాదని.. పెద్దఎత్తున క్రౌడ్ ఫండింగ్ మొదలు పెట్టారు. ఇంపాక్ట్ గురు.కామ్‌లో ఫండ్ రైజింగ్ మొదలు పెట్టడంతో మంచి స్పందన వస్తోంది. దాతల సహకారంతో 10 రోజుల్లో సుమారు కోటీ 40 లక్షల రూపాయల వరకు వచ్చాయి. యోగేశ్ గుప్తా ఆశాజనక కళ్లతో ప్రతిసారీ ఇంపాక్ట్ గురు.కామ్‌ను తనిఖీ చేస్తూనే ఉంటున్నారు. ఇటూ ఉద్యోగంతోపాటు నిత్యం సోషల్ మీడియా, ఇతర సైట్లలో ఫండ్ రైజింగ్ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. తమ బాబుకు చికిత్స కోసం ప్రజలు ముందుకు వచ్చి ఆర్థిక సాయం చేస్తే.. అందరిలా మాములుగా అయ్యే అవకాశం ఉందని తండ్రి యోగేశ్ గుప్త కోరుతున్నారు.
ఈ సమస్య జోల్గన్ ఎస్‌ఎమ్‌ఏ ఔషధం ద్వారా పరిష్కారమవుతుంది. మన దేశంలో ఈ ఔషధం ఎక్కడా అందుబాటులో లేదు. దాని విలువ రూ.16 కోట్లు. మన దేశంలో మధ్యతరగతి కుటుంబాలైనా.. ఉన్నత వర్గాలకు చెందిన వారైనా రూ.16 కోట్లు ఖర్చు చేసి తమ కుమారుడికి చికిత్స చేయించే పరిస్థితి ఉండకపోవచ్చు. అందుకనే మేము ఇంపాక్ట్ గురు సహకారంతో ప్రజల నుంచి నగదు సేకరించాలని భావించాం. మన దేశంలో మంచి మనసు ఉన్నవారు చాలా మంది ఉన్నారు. వాళ్లంతా ముందుకు వచ్చి అయాన్ష్‌ను కాపాడతారని నమ్ముతున్నా.