హైదరాబాద్... దేశంలోనే ఉత్తమ నగరంగా ఎంపికైంది. జేఎల్ఎల్ సూచిక ఆధారంగా భాగ్యనగరం అన్ని నగరాల్లో మొదటి స్థానంలో నిలిచింది. హాలిడిఫై డాట్ కామ్ వెబ్‌సైట్ నిర్వహించిన ఈ సర్వే ఆసక్తికర విషయాలను వెల్లడించింది. పర్యాటకులు తమ ప్రాధాన్యతలపై గమ్యస్థానాలను ఎంపిక చేసుకోవడానికి ఈ వెబ్‌సైట్ తోడ్పడుతుంది. దేశంలో ఉత్తమ నివాస యోగ్యనగరంగా ఎంపిక చేయడంలో సాంస్కృతిక సమ్మేళనం ప్రాతిపదికన రూపుదిద్దుకున్న నగరాలపై ఈ సైట్ ఇటీవల సర్వే నిర్వహించింది.
అవే కారణాలు..
ఆయా నగరాల్లో అవకాశాలు, సదుపాయాలు, ఆర్థిక ప్రగతి, అభివృద్ధి కార్యక్రమాల అమలు తదితర అంశాల ఆధారంగా సర్వే నిర్వహించారు. హైదరాబాద్ తర్వాత 4 స్థానాల్లో ముంబయి, పుణె, చెన్నై, బెంగళూరు నిలిచాయి. సెప్టెంబరు నుంచి మార్చి వరకు హైదరాబాద్‌లో పర్యటించడానికి విశిష్టమైన కాలంగా రుజువైంది. ఇక్కడి పర్యాటక కేంద్రాల్లో రామోజీ ఫిల్మ్ సిటీ, చార్మినార్ , గోల్కొండ కోట మొదలైనవి పర్యాటకుల దృష్టిని అమితంగా ఆకర్షిస్తున్నాయని వెల్లడైంది.