కార్వీ స్టాక్ బ్రోకింగ్ డీమ్యాట్ ఖాతాదారులను నిలువునా ముంచిన ఛైర్మన్ పార్థసారథిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు రెండ్రోజులుపాటు ప్రశ్నించనున్నారు. నాంపల్లి న్యాయస్థానం అనుమతితో.. కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు.. మోసాలచిట్టాను బయటికి లాగేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఇండస్ ఇండ్ బ్యాంక్ నుంచి రూ.137కోట్లు రుణంగా తీసుకొని తిరిగి చెల్లించని కేసులో పార్థసారథిని రిమాండ్‌కు తరలించారు. ఆ కేసులో మరింత పురోగతి సాధించేందుకు పోలీసులు వివరాలుసేకరించనున్నారు. సీసీఎస్‌లో పార్థసారథిపై మరో రెండు కేసులు నమోదయ్యాయి. హెచ్డీఎఫ్సీ నుంచి 347కోట్లకు పైగా.. రుణం తీసుకొని తిరిగి చెల్లించకపోవడంతో కార్వీ స్టాక్ బ్రోకింగ్‌తో పాటు కార్వీ కమాడిటీస్ లిమిటెడ్ పై వేర్వేరుగా కేసులు నమోదు చేశారు.
రూ.500కోట్లకు పైగా రుణం
సైబరాబాద్‌లోనూ పార్థసారథిపై కేసు నమోదైంది. ఐసీఐసీఐలో 500కోట్లకు పైగా రుణం తీసుకొని తిరిగి చెల్లించలేదని గచ్చిబౌలిలో కేసు నమోదైంది. ఆ కేసును సైబరాబాద్ ఆర్థిక నేర విభాగానికి బదిలీ చేశారు. ఏపీలోనూ కార్వీ స్టాక్ బ్రోకింగ్ పై కేసు నమోదైంది. 2009లో తన డీమ్యాట్ ఖాతా నుంచి 5 లక్షలకు పైగా నగదు మాయమైందని శ్రీనివాస్ అనే వ్యక్తి... పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భీమవరం పోలీసులు కేసు నమోదు చేసి న్యాయస్థానంలో నేరాభియోగపత్రం దాఖలు చేశారు. పార్థసారథి ఒక్కసారి న్యాయస్థానంలో హాజరు కాకపోవడంతో.. అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. హైదరాబాద్ నుంచి పీటీ వారెంట్‌పై పార్థసారథిని భీమవరం తీసుకెళ్లే యోచనలో పోలీసులు ఉన్నారు.