హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి రుణం తీసుకొని తిరిగి చెల్లించని కేసులో కార్వీ ఎండీ పార్ధసారథిని సీసీఎస్ పోలీసులు ప్రశ్నించారు. చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పార్ధసారథిని నాంపల్లి కోర్టు అనుమతితో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు రెండు రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. బ్యాంకులను మోసం చేసిన వైనంపై సీసీఎస్ పోలీసులు పార్ధసారథిని ప్రశ్నించారు. ఇప్పటికే ఇండస్ ఇండ్ బ్యాంకును మోసం చేసిన కేసులో సీసీఎస్ పోలీసులు పార్ధసారథిని రెండుసార్లు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించారు.
పార్ధసారథిని ప్రశ్నించిన క్రమంలో... బ్యాంకుల నుంచి రుణం తీసుకొని డొల్ల కంపెనీలకు మళ్లించిన విషయం బయటపడింది. దీంతో కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ సీఈఓ రాజీవ్ రంజన్ సింగ్, సీఎఫ్ఓ కృష్ణహరిలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి కూడా రూ.347కోట్లు రుణం తీసుకొని తిరిగి చెల్లించలేదు. బ్యాంకు ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన సీసీఎస్ పోలీసులు మొదటి రోజు కస్టడీలో భాగంగా పలు ప్రశ్నలు వేశారు. ఇప్పటికే కార్వీ ఆడిట్ నివేదికతో పాటు... పార్ధసారథి ఇంట్లో పలు హార్డ్ డిస్క్‌లు, పెన్ డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో సమాచారాన్ని విశ్లేషించిన సీసీఎస్ పోలీసులు.. కార్వీ మోసాల గురించి పార్ధసారథిని ప్రశ్నించారు.