ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలంగాణలోని హుజూర్నగర్ ఉప ఎన్నిక ఓట్లను ఇవాళ లెక్కించనున్నారు. సూర్యాపేటలోని వ్యవసాయ మార్కెట్ గోదాం ఆవరణలో... లెక్కింపు చేపట్టనున్నారు. ఇందుకోసం 150 మందికి పైగా సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 కల్లా ఫలితం తేలనుంది. 14 టేబుళ్లు ఏర్పాటు చేసి, 22 రౌండ్లలో లెక్కించనున్నారు.
ఆఖర్లో వీవీప్యాట్ల లెక్కింపు
తొలుత ఎలక్ట్రానిక్ ట్రాన్స్ ఫర్ ఫర్ పోస్టల్ బ్యాలెట్ సర్వీస్... ఈటీపీబీఎస్ ఓట్లను లెక్కిస్తారు. అవి పూర్తైన తర్వాత... ఈవీఎంలను లెక్కిస్తారు. ఐదు పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించనున్నారు. 302 పోలింగ్ కేంద్రాలుండగా... అందులో ఐదింటివి మాత్రమే లెక్కిస్తారు. ఇందుకోసం ఏ కేంద్రాల వీవీప్యాట్లు తీసుకోవాలనేది లాటరీ పద్ధతిన నిర్ణయిస్తారు. ఉదయాన్నే లాటరీ పద్ధతి నిర్వహించినా... ఈవీఎంల లెక్క పూర్తైన తర్వాతే వీవీప్యాట్ల లెక్కింపు చేపడతారు.