తెలంగాణలోని హుజూర్నగర్లో ఉపఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలింగ్ సరళిని ఎస్పీ భాస్కరన్ పరిశీలించారు.
పలు ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో కాసేపు పోలింగ్ నిలిచిపోయింది. పాలకవీడు మండలం బెట్టెతండాలో... వీవీప్యాట్, బ్యాలెట్ అనుసంధానంలో సమస్య తలెత్తింది. అటు నేరేడుచర్ల మండలం చింత బండ పోలింగ్ కేంద్రంలోని ఈవీఎంలో... సమస్య ఎదురైంది. వీటిని అధికారులు పరిశీలిస్తున్నారు.
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుండ్లపల్లిలో హుజూర్నగర్ ఉపఎన్నిక తెరాస అభ్యర్థి సైదిరెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎస్పి క్యాంపస్లో తెదేపా అభ్యర్థి చావా కిరణ్మయి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
హుజూర్నగర్ నియోజకవర్గంలో 79 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించారు. 540 మంది సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, 400 మంది టీఎస్ఎస్పీ దళ సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం 1500 మంది సిబ్బంది పోలింగ్ విధులు నిర్వహిస్తున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్, యాక్ట్ 30 అమల్లో ఉంది.