హైదరాబాద్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద వచ్చి ముంపు సమస్య ఏర్పడింది. ఈ సమస్యను అధిగమించేందుకు పెద్ద ఎత్తున వరదనీరు చేరే హుస్సేన్‌సాగర్‌పై... నీటిపారుదల శాఖ అధికారి మురళీధర్ ఛైర్మన్‌గా ప్రభుత్వం కమిటీ నియమించింది. పలు ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేసిన ఈ కమిటీ... ఉన్నతాధికారులతో సమావేశమై...150 కోట్లతో వరద గేట్లు అమర్చాలని నిర్ణయించింది.
ప్రవాహం వచ్చినప్పుడు
హుస్సేన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 మీటర్లుకాగా... రిజర్వాయర్‌లో ఎప్పుడూ నీరు ఉంటుంది. భారీ వర్షాలు పడి ప్రవాహం వచ్చినప్పుడు అదనపు నీరు అలుగు మీదుగా బయటకి వెళ్తుంది. ఈ సమయంలో కొంతనీరు వెనక్కి తన్ని పలు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ ప్రాంతాలను ఖాళీ చేయించడం సాధ్యం కాదు కాబట్టి... దిగువకు ఎక్కువ ప్రవాహం పంపించడంపై అధికారులు దృష్టి సారించారు. ప్రస్తుతం మారియట్ హోటల్ వద్ద ఉన్న అలుగును మూడు మీటర్లు వరకు తొలగించి... గేట్లు అమర్చాలని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. డిజైన్ పూర్తయితే ఎన్ని గేట్లు ఏర్పాటు చేయవచ్చు. వాటి ఎత్తు ఎంతుంటుంది. ఎంతనీటిని బయటకి వదలవచ్చు తదితర సాంకేతిక అంశాలన్నీ ఖరారవుతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.