వర్షాలు పంటలపై పంజా విసిరాయి. రాష్ట్రవ్యాప్తంగా గత 4 రోజులుగా కురుస్తున్న కుంభవృష్టి వానలతో వేల ఎకరాల్లో పంటలు మునిగి రైతులకు భారీగా నష్టం వాటిల్లింది. అయినా వ్యవసాయాధికారులు ఎక్కడా పంట నష్టాలను అధికారికంగా గుర్తించడం లేదు. దీంతో తాము పెట్టుబడి రాయితీని కోల్పోతున్నట్లు రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం పలు జిల్లాల్లో కోత దశకు చేరిన పెసర, మినుము, మొక్కజొన్న వంటి పంటలు నేలపాలయ్యాయి. పూత కాత దశలో ఉన్న పత్తిచేలలో 2 నుంచి 3 అడుగుల ఎత్తున నీరు నిలిచి చెట్లు కుళ్లిపోతున్నాయి. వరి నాట్లూ నీటమునిగాయి. చెరువులు, వాగులు పొంగి పొలాల్లోకి నీరు వచ్చిన ప్రాంతాల్లో ఇసుక, మట్టి మేటలు వేశాయి. పంట నష్టాలను ఫొటోలు తీసి అధికారులకు వాట్సాప్ ద్వారా పంపిస్తున్నా వారి నుంచి స్పందన ఉండడంలేదని రైతులు వాపోతున్నారు. పంటల నష్టం వివరాలు ఇవ్వాలని వ్యవసాయశాఖ కార్యదర్శి, కమిషనర్ ఎం.రఘునందన్‌రావును ‘ఈనాడు - ఈటీవీ భారత్’ అడిగితే సమాధానం ఇవ్వలేదు. వర్షాలతో, వరదలతో 50 శాతానికి పైగా పంట నష్టపోతేనే వివరాలు పంపాలని మౌఖిక ఆదేశాలున్నందున సమగ్రంగా సేకరించడంలేదని ఓ జిల్లా వ్యవసాయాధికారి ‘ఈనాడు - ఈటీవీ భారత్’తో చెప్పారు.
33 శాతం దెబ్బతింటే పెట్టుబడి రాయితీ!
విపత్తులతో ఎకరా పైరులో 33 శాతం దెబ్బతింటే పెట్టుబడి రాయితీ కింద రైతుకు తక్షణ సాయం అందజేయాలని కేంద్ర విపత్తు నిర్వహణ శాఖ చెబుతోంది. అంత నష్టం ఉంటే ఎకరానికి పంటను బట్టి రూ.10 వేల వరకూ ఇస్తారు. ఈ సొమ్ము రావాలంటే రాష్ట్ర వ్యవసాయశాఖ సమగ్ర వివరాలను కేంద్రానికి పంపాలి. అనంతరం కేంద్ర బృందం తనిఖీ చేసి నిధులు విడుదల చేస్తుంది. కానీ రాష్ట్ర వ్యవసాయశాఖ క్షేత్రస్థాయిలో వివరాలే సేకరించకపోవడంతో కేంద్రానికి గత మూడేళ్లుగా నష్టాల వివరాలు పంపడం లేదని ఓ అధికారి చెప్పారు. ప్రధానమంత్రి పంటల బీమా పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నుంచి పూర్తిగా నిలిపివేయడంతో బీమా పరిహారం వచ్చే అవకాశం కూడా లేదు.
కళ్ల ముందు నష్టాలు కనపడుతున్నా..