Accident: తెలంగాణలోని సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండల కేంద్రానికి చెందిన ములకలపల్లి రాములు-మైసమ్మ దంపతులు చాలా ఏళ్లుగా హైదరాబాద్‌లో నివాసం ఉండేవారు. అక్కడే వాచ్‌మెన్‌గా పని చేసేవారు. కుమారుడు వీరభద్రం(25)ను ఎంతో కష్టపడి చదివించారు. వృద్ధాప్యం రావడంతో ఏడాది క్రితమే స్వగ్రామం ఆత్మకూరు(ఎస్)కు వచ్చి ఉంటున్నారు. ఈ క్రమంలో దగ్గరి బంధువు, మేనమామ అయిన సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం అనాజిపురానికి చెందిన పేర్ల సైదులు-విజయ దంపతుల పెద్ద కుమార్తె ప్రణీత(20)తో వీరభద్రంకు వివాహం నిశ్చయమైంది. ఈ నెల 21న ఆత్మకూరు(ఎస్) మండలం నెమ్మికల్ సమీపంలోని దండుమైసమ్మ దేవాలయం వద్ద వైభవంగా పెళ్లి జరిపించారు. ఇంకా పదహారు రోజుల పండుగ కూడా పూర్తి కాలేదు. అంతలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రణీత తల్లిదండ్రులు కూడా హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్‌లోనే నివాసం ఉంటూ వాచ్‌మెన్‌గా పని చేస్తారు.
హైదరాబాద్‌కు వెళ్తూ.. వీరభద్రం హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్‌లో ఉన్న రిలయన్స్ జియో డిజిటల్ స్టోర్‌లో పని చేస్తాడు. వీరభద్రం పెళ్లికి వారం రోజుల ముందే సెలవు పెట్టాడు. పెళ్లి జరిగి వారం రోజులు అవుతుందని విధుల్లో చేరేందుకు హైదరాబాద్‌కు భార్య ప్రణీతతో కలిసి ఆత్మకూరు(ఎస్) నుంచి సోమవారం మధ్యాహ్నం ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా సమీపంలోకి రాగానే జాతీయ రహదారి పైనుంచి అదుపు తప్పి ద్విచక్రవాహనం టోల్‌గేట్ బోర్డును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వీరభద్రం మెడ పైభాగంతో పాటు ఇతర చోట్ల తీవ్రమైన గాయాలయ్యాయి. భార్య ప్రణీతకు చేయి విరిగింది. ఇద్దరిని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా వీరభద్రం అప్పటికే మృతి చెందాడు. భార్య ప్రణీత ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు ప్రమాద వివరాలు సేకరించారు. వీరభద్రం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రి మార్చురీలో భద్రపరిచారు.