రాష్ట్రంలో ఏటా 26 వేల మంది పాము కాట్లకు గురవుతున్నారు. పల్లె జనం పొలం, ఇతర పనులకు వెళ్లిన సమయంలో ఎక్కువగా బాధితులవుతున్నారు. వర్షాకాలంలో చెట్లు, పొదల్లో... గుంతలు, ఇతరచోట్ల పాములు బయటకు వస్తూ ఆ సమీపంలో ఉండేవారిని కరుస్తున్నాయి. ప్రతి ఏడాదీ జూన్ నుంచి అక్టోబరు మధ్య సమస్య తీవ్రంగా ఉంటోంది.
50 రకాల పాములు ప్రాణాంతకమైనవి
పాముల్లో వేల రకాలు ఉన్నప్పటికీ... అన్నీ విషపూరితమైనవి కావు. 50 రకాలనే ప్రాణాంతకమైనవిగా గుర్తించారు. ముఖ్యంగా ఎక్కువగా తారసపడే వాటిలో తాచు(నాగు) పాము, రక్త పింజర, కట్లపాము విషపూరితమైనవి. సకాలంలో చికిత్స అందకుంటే బాధితులు కోమాలోకి వెళ్లడం/చనిపోయే ప్రమాదం ఉంది.
- రాష్ట్రంలో 2017లో 85 మంది, 2018లో 118 మంది, 2019లో 467 మంది పాము కాటుతో మరణించారు.
- దేశవ్యాప్తంగా 2017లో 1.58 లక్షలు, 2018లో 1.65 లక్షలు, 2019లో 1.62 లక్షల పాము కాట్లు నమోదయ్యాయి.
- 2017లో 1,060 మంది, 2018లో 887, 2019లో 3,163 మంది చనిపోయారు.