కంటిలో రెటీనా మధ్యభాగం (మాక్యులా) క్షీణిస్తున్న కొద్దీ చూపు తగ్గడమే గాక తీవ్రమైతే.. లేనిది ఉన్నట్లుగా భ్రమిస్తుందని కంటి వైద్య నిపుణులు చెబుతున్నారు. చార్లెస్ బానెట్ సిండ్రోమ్ అనే ఈ వ్యాధి వయసు మళ్లిన వాళ్లలో ఎక్కువగా కనిపిస్తుందని తెలిపారు. దృశ్య సమాచారాన్ని మెదడు ఎలా నిక్షిప్తం చేసుకుంటున్నది పూర్తిగా తెలియదు గానీ కంటి నుంచి అందాల్సిన సమాచారం ఆగిపోయినప్పుడు మాత్రం అది సొంత దృశ్యాలను సృష్టించుకోవటం ఆరంభిస్తుంది. ఇది భ్రమలకు దారితీస్తుంది.
మాక్యులా క్షీణిస్తే భ్రమిస్తారు.. - macula is depletion in eyes
కంటికి నేరుగా ఉండే వస్తువులు, దృశ్యాలు స్పష్టంగా కనిపించాలంటే రెటీనా మధ్యభాగం (మాక్యులా) బాగుండాలి. కాకపోతే ఇది వృద్ధాప్యం ముంచుకొస్తున్న కొద్దీ క్షీణిస్తూ వస్తుంటుంది. (ఏఎండీ) దీంతో చూపు తగ్గటమే కాదు, సమస్య మరీ తీవ్రమైతే లేనిది ఉన్నట్టుగా భ్రమించటానికీ దారితీస్తుంది! దీన్నే చార్లెస్ బానెట్ సిండ్రోమ్ అని అంటారు.
అప్పటివరకూ నిక్షిప్తమైన దృశ్యాలను మెదడు వినియోగించుకోవటం దీనికి కారణం కావొచ్చు. మొదట్లో గీతలు, డిజైన్లు. అంటే ఇటుకలు, వలల వంటివి ఉన్నట్టుగా అనిపించొచ్చు సమస్య తీవ్రమైతే మనుషులు, జంతువులు, కట్టడాలు, మైదానాల వంటివీ కనిపించొచ్చు. ఒంటరిగా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇలాంటి భ్రాంతులకు ఎక్కువగా లోనవుతుంటారు. దీంతో తమకేదో అయిపోయిందని, మతిమరుపు వచ్చేసిందని, మానసిక జబ్బు తలెత్తిందని బాధపడుతుంటారు.
డాక్టర్లు సైతం దీన్ని అర్థం చేసుకోవడంలో పొరపడుతుంటారు. ఇలాంటి అయోమయాన్ని తొలగించటానికి ఎలక్ట్రో ఎన్ కెఫలోగ్రఫీ (ఈఈజీ) పరీక్ష ఉపయోగపడగలదని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. రెటీనా మధ్యభాగం క్షీణించినవారి మెదడులో తలెత్తే అతి స్పందనలు భ్రాంతులకు దారితీస్తాయని.. తగ్గిపోయిన చూపునకు అనుగుణంగా మెదడు మారటానికి ప్రయత్నించటం దీనికి కారణం కావొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. అందుకే చూపు తగ్గినవారిలో భ్రాంతులను, వీటి రకాలను గుర్తించటానికి మున్ముందు ఈఈజీ పరీక్ష తోడ్పడగలదని ఆశిస్తున్నారు. భ్రాంతులకు కారణమవుతున్న విషయాన్ని అర్థం చేసుకోగలిగిన వ్యక్తులు వీటికి అంతగా ప్రాధాన్యం ఇవ్వటం లేదని తేలటం విశేషం.
- ఇదీ చూడండి :సేంద్రియ సాగు విధానం రూపకల్పనకు కమిటీ ఏర్పాటు