మనుషుల జుట్టుతో భారీ అక్రమదందా సాగుతోంది. తెలుగురాష్ట్రాల్లోని మనుషుల వెంట్రుకల ఎగుమతిదారులు పెద్దఎత్తున అక్రమ పద్ధతుల్లో చైనాకు తరలిస్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తులో వెలుగుచూసింది. చైనా బెట్టింగ్‌యాప్‌లపై విచారణ చేస్తున్న ఈడీ బృందాలకు అనుకోకుండా మనుషుల కేశాల అక్రమదందా బయటపడింది. చైనీయుల నుంచి సుమారు 16 కోట్లు తెలుగు రాష్ట్రాల్లోని వెంట్రుకల వ్యాపారులకు చేరినట్లు తేలడంతో.. ఈడీ అధికారులు అప్రమత్తమయ్యారు. వెంట్రుకల వ్యాపారుల అక్రమ లావాదేవీలపై ఫెమా ఉల్లంఘనల కింద మరో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. హైదరాబాద్, తణుకులోని వికాస్ హెయిర్ ఎంటర్ ప్రైజెస్, నరేశ్ విమెన్ హెయిర్ ఎంటర్ ప్రైజెస్... హ్రితిక్ ఎగ్జిమ్, ఎస్.ఎస్.ఇంపెక్స్, శివ్ కేశవ్ హ్యూమన్ హెయిర్, లక్ష్మి ఎంటర్ ప్రైజెస్, ఆర్.కె. హెయిర్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాలు సహా 8 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.
ఉద్యోగుల పేరిట బ్యాంకు ఖాతాలు
మనుషుల వెంట్రుకల వ్యాపారుల కార్యాలయాల్లో భారీగా లెక్కాపత్రాలులేని నగదును ఈడీ స్వాధీనం చేసుకుంది. సుమారు 2 కోట్ల 90 లక్షలతోపాటు 12 మొబైల్ ఫోన్లు, 3 ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్, డైరీలు, ఖాతాల పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తుల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తిరుపతి, యాదాద్రి, విజయవాడ తదితర పుణ్యక్షేత్రాలతోపాటు... స్థానిక క్షౌరశాల నుంచి వెంట్రుకలు సేకరించి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రధానంగా మియన్మార్, బంగ్లాదేశ్, వియత్నాం, ఆస్ట్రియా, చైనా తదితర దేశాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఆ అక్రమ ఎగుమతుల కోసం మియన్మార్‌కు చెందిన పలువురు హైదరాబాద్‌లో తిష్టవేసినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. వెంట్రుకల ఎగుమతి దారులు అక్రమ లావాదేవీల కోసం తమ ఉద్యోగుల పేరిట బ్యాంకు ఖాతాలు తెరిచినట్లు గుర్తించారు.