ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పది రోజులే గడువు.. ఎల్​ఎర్​ఎస్​ దరఖాస్తు కోసం జనం క్యూ - huge response to LRS in telangana

తెలంగాణలో అక్రమ ప్లాట్లు, అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్​కు భారీ స్పందన వస్తోంది. గడిచిన 25 రోజుల్లోనే సుమారు 8 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. 2015 సంవత్సరంలో ప్రభుత్వం మొదటిసారిగా ఎల్ఆర్ఎస్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈసారి గ్రామ పంచాయతీల నుంచి కూడా ఎల్ఆర్ఎస్​కు దరఖాస్తు అవకాశం కల్పించింది. ఇప్పుడు క్రమబద్దీకరణ చేసుకోని ప్లాట్లు, లేఅవుట్లకు భవిష్యత్తులో రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తామని సర్కార్ వెల్లడించగా.. అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకునేందుకు యాజమానులు ముందుకు వస్తున్నారు.

layout-regularization-scheme-in-telangana
layout-regularization-scheme-in-telangana

By

Published : Oct 5, 2020, 6:05 PM IST

తెలంగాణలో మరోసారి అనధికార ప్లాట్లు, అక్రమ లేఅవుట్ల క్రమబద్దీకరణకు పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆగస్టు 31వ తేదీ నుంచి పథకం అమల్లోకి వచ్చినట్లుగా సర్కార్ ప్రకటించింది. ఆగస్టు 26 తేదీ కంటే ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న లేఅవుట్లు, ప్లాట్ల యాజమాన్యాలకు ఎల్ఆర్ఎస్ పథకంలో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. జీహెచ్ఎంసీతో పాటు నగర పాలక సంస్థలు, హెచ్ఎండీఏ, పురపాలక సంఘాలు, గ్రామ పంచాయతీల నుంచి అనుమతులు లేకుండా వేసిన లేఅవుట్లతో పాటు ప్లాట్లు కొనుగోలు చేసిన వారందరూ ఈ పథకానికి అర్హులవుతారు.

సెప్టెంబర్ 7 ప్రారంభం

మాస్టర్ ప్లాన్, జోనల్ అభివృద్ధి ప్లాన్లలో భూ కేటాయింపులకు అనుగుణంగా మాత్రమే రెగ్యులరైజ్ చేయనున్నారు. అక్రమ లేఅవుట్లలో కొనుగోలు చేసిన ప్లాట్లలో భవిష్యత్తులో నిర్మాణం చేయడానికి.. అక్కడ కనీస మౌలిక సదుపాయాల ఏర్పాట్లకు.. వాటి క్రయ విక్రయాలకు అవకాశం లేనందునా వాటిని క్రమబద్దీకరణ చేసుకునేందుకు పెద్ద ఎత్తున యాజమానులు ముందుకు వస్తున్నారు. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ఆన్ లైన్​లో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమైంది. మీసేవలో లేదా .. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.

పురపాలికల నుంచే ఎక్కువ..

రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 4 తేదీ వరకు 7 లక్షల 83 వేల 372 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా పురపాలక సంఘాల నుంచి.. 3 లక్షల 14 వేల 859 దరఖాస్తులు, గ్రామ పంచాయతీల నుంచి 3 లక్షల 8 వేల 216, కార్పొరేషన్ల నుంచి లక్షా 60 వేల 297 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు ఫీజు కింద ప్రభుత్వానికి 79.66 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది.

అక్టోబర్ 15 వరకే గడువు

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుకు అక్టోబర్ 15 చివరి తేదీగా ప్రభుత్వం నిర్ణయించింది. వ్యక్తిగత ప్లాట్ యాజమానులు వెయ్యి రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు, లే అవుట్ యాజమాన్యాలు రూ.10 వేల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ చేసుకున్న రోజున రిజిస్ట్రార్ మార్కెట్ వ్యాల్యూ చదరపు గజానికి 3 వేల రూపాయలు ఉన్న భూములకు ఎల్​ఆర్​ఎస్ క్రమబద్దీకరణ కింద 25 శాతం ఛార్జీలు, 3001 నుంచి 5వేల రూపాయల వరకు మార్కెట్ వ్యాల్యూ ఉన్న భూములకు 50 శాతం, గజానికి 5001 నుంచి 10 వేల రూపాయల వరకు మార్కెట్ విలువ ఉన్న భూమికి 75శాతం, 10 వేలకు పైగా మార్కెట్ వ్యాల్యూ ఉన్న భూములకు చదరపు గజానికి 100శాతం ఎల్​ఆర్​ఎస్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

ఎల్​ఆర్​ఎస్​ వర్తించేంది వీటికే..

లేఅవుట్ లేదా ప్లాట్.. నాలాకు రెండు మీటర్ల దూరం ఉండాలి. వాగుకు ఐతే 9 మీటర్ల దూరం ఉండాలి. 10 హెక్టార్లలోపు ఉన్న చెరువుకు 9 మీటర్ల దూరం ఉండాలి. 10 హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న చెరువుకు 30 మీటర్ల దూరం ఉండాలి. ఎయిర్‌పోర్టు, డిఫెన్స్ స్థలానికి 500 మీటర్ల దూరం ఉండాలి. అలాంటి ప్లాట్లు లేదా లేఅవుట్లకు మాత్రమే ఎల్​ఆర్​ఎస్​ వర్తిస్తుంది.

అందుకే నెమ్మదిస్తోంది

ప్రణాళికబద్దమైన అభివృద్దే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం అక్రమ లేఅవుట్లు, అందులోని ప్లాట్లలను రిజిస్ట్రేషన్ చేయొద్దంటూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. పంచాయతీ రాజ్ శాఖ అధికారుల అంచనా ప్రకారం కేవలం గ్రామాల్లోనే 10 లక్షల వరకు అనధికార ప్లాట్లు, అక్రమ లేఅవుట్లు ఉన్నాయని తేలింది. దరఖాస్తుకు 10 రోజుల గడువే ఉన్నా.. గ్రామపంచాయతీల నుంచి ఆశించిన రీతిలో దరఖాస్తులు రావడం లేదని అధికారులు చెబుతున్నారు. ఆస్తుల ఆన్​లైన్ ప్రక్రియ కూడా ఉండడటం వల్ల కొంచెం నెమ్మదించే అవకాశం కనిపిస్తోందని వెల్లడించారు.

పరిశీలన అప్పుడే..

ఇప్పటి వరకు కేవలం దరఖాస్తులు చేసుకునే అవకాశం మాత్రమే ప్రభుత్వం కల్పించింది. కానీ అధికారుల పరిశీలనకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. ఆస్తుల ఆన్ లైన్ ప్రక్రియ పూర్తయ్యాక.. ఎల్ఆర్ఎస్​పై ప్రభుత్వం దృష్టిసారించే అవకాశం ఉంది.

ఇదీ చదవండి

'బిహార్​లో ఎన్​డీఏ గెలుపునకు అసలు కారణం ఆర్​జేడీ'

ABOUT THE AUTHOR

...view details