ఆపత్కాలంలోని మహిళలను ఆదుకునేందుకు ఏపీ పోలీసు శాఖ తీసుకొచ్చిన దిశ యాప్‌కు ప్రస్తుతం వస్తున్న ఫిర్యాదుల్లో అత్యధిక శాతం కుటుంబ సమస్యలే ఉంటున్నాయి. తన భర్త విచక్షణారహితంగా విపరీతంగా కొడుతున్నాడంటూ కృష్ణా జిల్లాకు చెందిన ఓ మహిళ, విశాఖపట్నం నగరానికి చెందిన మరో మహిళ యాప్ ద్వారా ఫిర్యాదు చేశారు. చేతిలోని మొబైల్ ఫోన్ మూడు సార్లు ఊపటం (షేక్ చేయటం) ద్వారా తాము సమస్యలో ఉన్నట్లు దిశ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. పోలీసులు నిమిషాల వ్యవధిలో బాధితుల వద్దకు చేరుకుని వారి భర్తల వేధింపుల నుంచి కాపాడారు. అనంతరం అన్నిరకాల సేవలు అందించే వన్‌స్టాప్ సెంటర్‌కు బాధితులను పంపించారు. కుటుంబ సమస్యలపై ఫిర్యాదులు చేసేవారికి నిపుణులు, పోలీసులతో కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు.
వేధింపులపై ఫిర్యాదుల అస్త్రం
* వరుసకు సోదరుడైన ఓ వ్యక్తి తనను వేధిస్తున్నాడని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ మహిళ యాప్‌లోని ఆపత్కాల మీట (ఎస్‌వోఎస్) నొక్కి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
* ఓ వ్యక్తి తనను తరచూ వేధిస్తున్నాడని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బాలిక ఫిర్యాదు చేసింది. పోలీసులు బాధిత బాలిక వద్దకు చేరుకుని ఆమెకు భరోసా కల్పించారు. వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.