రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆర్టీసీ ప్రారంభించిన భారీ వాహనాల డ్రైవింగ్ శిక్షణ నిరుద్యోగుల్లో ఆశలు రేపుతోంది. 20 ఏళ్ల వయసు, 8 తరగతి ఉత్తీర్ణత, ఏడాది వ్యవధి కారు లైసెన్సు కలిగిన వారికి కల్పించిన ఈ అవకాశాన్ని వినియోగించుకొనేందుకు పెద్ద సంఖ్యలో యువత ఆసక్తి చూపుతోంది. నెలన్నర పాటు జరిగే శిక్షణకు 23 వేల రూపాయలు ఫీజుగా నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా బస్ డిపోల్లో దరఖాస్తు చేసుకుంటున్న వారిలో బ్యాచ్‌కు 16 మంది చొప్పున ఎంపిక చేసి ఆర్టీసీ అధికారులు అత్యుత్తమ శిక్షణ ఇస్తున్నారు.
సుశిక్షితులైన సిబ్బందితో శిక్షణ
విశాలమైన తరగతి గదులు, సుశిక్షితులైన సిబ్బందితో పాటు బస్సును డ్రైవింగ్ శిక్షణ కోసం అందుబాటులో ఉంచారు. 32 రోజుల పాటు జరిగే శిక్షణలో 16 రోజుల పాటు బోధనా తరగతులు, మరో 16 రోజులు శిక్షణ ఇస్తారు. రవాణా శాఖకు చెందిన సీనియర్ అధికారులు, విశేష అనుభవం కలిగిన డ్రైవర్లతో పాఠాలు బోధిస్తారు. ట్రాఫిక్ నిబంధనలు, హెచ్చరిక బోర్డుల వివరాలు, జాగ్రత్తలు, ఇంధన పొదుపు విధానాలు, వాహనాల మరమ్మతులు, ఆరోగ్య పరిరక్షణ ఇలా సవివరంగా తెలియజేస్తారు.