ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో విస్తారంగా వర్షాలు.. హైదరాబాదులో జనజీవనం అస్తవ్యస్తం - తెలంగాణకు వర్ష సూచన

తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం నుంచి పలుప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం పడుతూనే ఉంది. ఛత్తీస్‌గఢ్‌పై ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలులతో ద్రోణి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉంది. తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో గురువారం రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది.

huge-rainfall-in-telangana-
భారీ వర్షానికి హైదరబాదులో జనజీవనం అస్తవ్యస్తం

By

Published : Jul 15, 2021, 9:31 AM IST

హైదరాబాద్ జంట నగరాల్లో వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా వర్షం కురవడంతో.... చెరువుల్లోని నీరు ఇళ్లలోకి చేరాయి. భారీ వర్షానికి నాగోల్ పరిధిలోని అయ్యప్పకాలనీ నీట మునిగింది. కాలనీ ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి తమ బంధువుల ఇళ్లకి వెళ్లగా... మరికొందరు వర్షంలో తడుస్తూ రోడ్లపైనే ఉన్నారు. ఇక్కడ సుమారు 400 ఇళ్లు ఉండగా... సగం ఇళ్లలోకి అర్ధరాత్రి వరద ప్రవాహం వచ్చి చేరింది. దీంతో అయ్యప్పనగర్‌కాలనీ, మల్లికార్జుననగర్, ఫేజ్-2 త్యాగరాజనగర్‌కాలనీ వాసులు... ఇళ్లు ఖాళీ చేసి బయటకెళ్లారు. ఎత్తైన ప్రాంతాల్లోని ఇళ్లకు వెళ్లి తల దాచుకోగా... మరికొందరు బంధువుల ఇళ్లకి వెళ్లారు. చుట్టూ ఉన్న చెరువుల నీరు ఇక్కడికి వచ్చి చేరుతుందని మూడు కాలనీల వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.

అర్ధరాత్రి ఇళ్లు మునుగుతున్నా... జీహెచ్​ఎంసీ ఎందుకు పట్టించుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కనీసం పునరావాసం కూడా ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది ఇదే పరిస్థితి ఎదురైతే అధికారులు వరద సాయం అందించి చేతులు దులుపుకున్నారని స్థానికులు వాపోయారు. శాశ్వత పరిష్కారం చూపకపోవడంతో ప్రతిసారి ఇళ్లు వదిలి రోడ్లపైకి రావాల్సి వస్తోందని మండిపడుతున్నారు.

కూలిన భవనం..

నగరంలోని మిగతా చోట్ల కూడా భారీ వర్షం కురిసింది. హబ్సిగూడా, అంబర్‌పేట్‌, రామంతపూర్ డివిజన్లలో భారీగా వాన పడడంతో... విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. యూసుఫ్‌గూడ, శ్రీ కృష్ణనగర్ బి బ్లాకులో వరద నీరు రోడ్లపై భారీగా ప్రవహించింది. సరూర్‌నగర్ చెరువు కట్ట లోతట్టు ప్రాంతంలో ఉన్న కోదండరాంనగర్, సీసల బస్తీ, వీవీ నగర్, కమలానగర్ ప్రాంతాల్లో వరదనీరు ఏరులై పారింది. ఆయా కాలనీల్లో వరద నీరు ఇళ్ల లోకి చేరడంతో నగరవాసులు ఇబ్బందులు పడ్డారు. వర్షానికి పాత మలక్‌పేటలోని పురాతన భవనం కూలిపోయింది.

నేడు భారీ వర్ష సూచన..

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ కూడా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది.

ఇది చదవండి :పాఠశాలల్లో ప్రవేశాలు నేటి నుంచి..

ABOUT THE AUTHOR

...view details