తెలగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. వరంగల్ జిల్లాపై వరుణుడు ప్రతాపం చూపించాడు. దంచికొట్టిన వానలకు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. హనుమకొండ జిల్లా ఆత్మకూర్ మండలంలో కటాక్షాపురం వంతెన పైనుంచి వరదనీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రామప్పకు వెళ్లే దారి ఇదే కాగా... వాహనదార్లకు ఇక్కట్లు తప్పడం లేదు. మహబూబాబాద్ జిల్లా దొరవారి తిమ్మాపురంలో వ్యవసాయ పనులకు వెళ్లిన రైతులు... శివారులోని వాగులో చిక్కుకున్నారు. స్థానికులు అక్కడికి చేరుకుని తాడు సాయంతో 12 మందిని వాగు దాటించారు. గార్ల మండలంలో పాకాల చెక్ డ్యామ్ పైనుంచి వరద ఉప్పొంగడంతో రాంపురం, మద్దివంచ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బయ్యారం మండలం తిమ్మాపురంలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. పెసరబండ ప్రభుత్వ పాఠశాల జలదిగ్బంధమైంది. బడిలోకి పూర్తిగా నీరు చేరడంతో విద్యార్థులు అవస్థలు పడ్డారు. గీసుకొండ మండలం కొనాయమాకుల గ్రామంలో పాఠశాల చెరువులా మారింది. హనుమకొండ జిల్లా పసరగొండలో బడి నుంచి ఇంటికి వస్తున్న విద్యార్థులు వరదనీటిలో చిక్కుకుని కొట్టుకుపోతూ పొదల్లో చిక్కుకున్నారు. స్థానికులు అప్రమత్తమై తాళ్ల సాయంతో పిల్లలను రక్షించారు.
పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్ష..
నర్సంపేట నియోజకవర్గంలో చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. నాచినపల్లిలో రోడ్డు దాటుతున్న ఓ యువకుడు... బతుకమ్మ చెరువు మత్తడి ప్రవాహంలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు. నర్సంపేటలో అనేక ప్రాంతాలు నీటమునిగాయి. వరంగల్లో జోరు వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. హనుమకొండలో రోడ్లపై మోకాళ్లలోతు వరదనీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. సంగెం మండలంలో వరదనీటిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని స్థానికులు కాపాడారు. పళ్లారుగూడ-మొండ్రాయి గ్రామాల మధ్య వరదలో రోడ్డు దాటేందుకు ప్రయత్నించిన ద్విచక్రవాహనదారుడు... బైక్‌తో సహా కొట్టుకుపోతుండగా... స్థానికులు రక్షించారు. భారీ వర్షాల పట్ల వరంగల్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని నిర్దేశించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రజలకు సూచించారు. రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కుండపోత..
ఉమ్మడి ఖమ్మం జిల్లాను కుండపోత వానలు వణికించాయి. కొత్తగూడెం జిల్లాలో ఎడతెరపి లేకుండా వాన దంచికొట్టింది. కొత్తగూడెం, పాల్వంచ, మధిర, బోనకల్లు, ఏర్రుపాలెం, వైరా, ఏన్కూరు మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇల్లందులో బుగ్గవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో జనజీవనం స్తంభించింది. నియోజకవర్గం వ్యాప్తంగా అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సత్యనారాయణపురంతో పాటు పలు వార్డులకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షానికి అశ్వాపురం మండలంలోని ఇసుకవాగు, లోతువాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల రోడ్లు కోతలకు గురయ్యాయి. సుమారు 8 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మణుగూరు బొగ్గుగనుల్లో ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. భద్రాచలం, బూర్గంపాడు, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో చాలా చోట్ల పంటలు నీటమునిగాయి. పలుచోట్ల రహదారులపై వరదనీరు ప్రవహిస్తోంది.
రాత్రంతా నిద్రలేకుండా గడిపాం..
అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి మెదక్ పట్టణంలోని గాంధీనగర్ వీధిలోని ఇళ్లలోకి నీరు చేరింది. ఫలితంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాత్రంతా నిద్రలేకుండా గడిపామని.. ఇళ్లలోని వస్తువులన్నీ తడిచిపోయాయని.. మరికొన్ని వస్తువులు నీళ్లలో కొట్టుకుపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న డీఎస్పీ.. నీట మునిగిన ఇళ్లను పరిశీలించారు. ఫైర్ ఇంజిన్ సాయంతో ఈ నీటిని తొలగించే పనులు చేయిస్తున్నారు. సమాచారం అందుకున్న పురపాలక ఛైర్మన్ చంద్రపాల్.. ఇళ్లను పరిశీలించారు. బాధితులకు నిత్యావసర సరకులను అందించారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని.. బాధితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
చినుకులతో మొదలై.. కుంభవృష్టి..
కరీంనగర్లో ఆదివారం కురిసిన భారీ వర్షానికి... విద్యానగర్, రాంనగర్, కరీంనగర్, జ్యోతి నగర్, ముకరంపుర, శ్రీనగర కాలనీల్లోని ప్రధాన రహదారులు నీటమునిగాయి. శాతవాహన యూనివర్సిటీ రోడ్డులో సెయింట్ జాన్స్ పాఠశాల ఎదురుగా ఉన్న ఇళ్లు, దుకాణాల్లోకి వరద నీరు చేరింది. ఫలితంగా అక్కడి ప్రజలు అవస్థలు పడుతున్నారు. భగత్‌నగర్, కట్ట రాంపూర్ వీధులు జలమయమయ్యాయి. సిరిసిల్ల రోడ్డులోని పద్మానగర్, రాంనగర్ ప్రధాన రహదారిపై నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. స్మార్ట్ సిటీ పనులు అసంపూర్తిగా వదిలేయడం, మురుగునీటి కాలువలు అనుసంధానం చేయకపోవడం వల్ల వల్లే సమస్యలు తలెత్తినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
లోతట్టు ప్రాంతాల్లో మేయర్ పర్యటన..
కరీంనగర్ నగర పాలక మేయర్ సునీల్‌రావు, కమిషనర్ అగర్వాల్ లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురవడం వల్ల మురుగు కాలువలు పొంగి.. రోడ్లపైకి నీరు చేరిందని సునీల్‌రావు అన్నారు.