తెలంగాణ మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం బ్రాహ్మణకొత్తపల్లిలోని అంగన్వాడీ కేంద్రంలో కుప్పలు తెప్పలుగా పాములు బయటకు రావడం కలకలం రేకేత్తిస్తోంది. మొదటి రోజు 30 పాము పిల్లలు, 2 తేళ్లు గోడల రంధ్రాల నుంచి బయటకు వచ్చాయి. స్థానికులు వాటన్నింటినీ చంపేయగా... రెండో రోజు అంగన్వాడీ కేంద్రాన్ని పక్కనే ఉన్న మరో గదిలోకి మారుస్తుండగా మరో 6 పాము పిల్లలు బయటకు వచ్చాయి. వాటిని కూడా గ్రామస్తుల సాయంతో చంపేశారు.
పిల్లలు రాకపోవడంతో తప్పిన ప్రమాదం
కొవిడ్ నిబంధనల వల్ల ఆహారాన్ని ఇంటి వద్దకే అందించడం వలన పిల్లలెవరూ అంగన్వాడీ కేంద్రానికి రావడం లేదు. దీంతో పెను ప్రమాదం తప్పింది. గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలోని ఓ గదిలో అంగన్వాడీ కేంద్రం నడుస్తోంది. భవనం శిథిలావస్థకు చేరుకోవడంతోనే పాములు, తేళ్లు వస్తున్నాయని... వెంటనే అక్కడి నుంచి అంగన్వాడీ కేంద్రాన్ని తరలించాలని గ్రామస్థులు కోరుతున్నారు.