ఫార్మాఎక్సైల్ ఆధ్వర్యంలో తెలంగాణలోని హైదరాబాద్ ఎఫ్టీసీసీఐ కార్యాలయంలో వాణిజ్య సప్తా: పేరుతో.. తెలంగాణ నుంచి విదేశాలకు ఎగుమతులకు పునరుజ్జీవ కల్పన, భారత సుస్థిరాభివృద్ధి అనే అంశాలపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో భారత్ బయోటెక్ ఛైర్మన్, ఎండీ డాక్టర్ కృష్ణా ఎల్లా పాల్గొన్నారు. గొప్ప యుద్ధాలే శాస్త్ర సాంకేతిక రంగ వృద్ధికి దోహదపడ్డాయని భారత్ బయోటెక్ ఛైర్మన్, ఎండీ డాక్టర్ కృష్ణా ఎల్లా అన్నారు. పెన్సిలిన్ వంటి వ్యాక్సిన్లు, యుద్ధ కారణంగానే అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు.
ప్రభుత్వాలు మారుతుండొచ్చు కానీ... సరైన అధికారులు ఉన్నప్పుడు మాత్రమే రాష్ట్రాల్లో వ్యాపార సంస్థల అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. ఇక భవిష్యత్తంతా పర్సనలైజ్డ్ మందులదే అన్న కృష్ణా ఎల్లా.. ఫార్మా రంగంలో వృద్ధి సాధించాలంటే పరిశోధనల్లో ఉపయోగించే జంతువుల దిగుమతికి సంబంధించిన నిబంధనలు సడలించాలని కేంద్రాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఫార్మాఎక్సైల్ ఇండియా డీజీ ఉదయ భాస్కర్, భారత వాణిజ్య పరిశ్రమల శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ శ్రీకర్ రెడ్డి, తెలంగాణ ఐటీ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఫారెన్ ట్రేడ్ అడిషనల్ డీజీ సీతారామ్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.