FIRE ACCIDENT: తెలంగాణలోని వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ధర్మారంలోని పారిశ్రామికవాడలో తెలంగాణ చేనేత సహకార సంఘం-టెస్కో గోదాంలో సోమవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఉవ్వెత్తున ఎగసిపడ్డ అగ్నికీలలకు పరిసర ప్రాంతవాసులు భయాందోళనలకు గురయ్యారు. వరంగల్, హనుమకొండ ప్రాంతాల నుంచి 6 అగ్నిమాపక వాహనాలు మంటలను అర్పేందుకు శ్రమించాయి. అగ్నికీలలు ఎగిసిపడడంతో మంటల ధాటికి గోదాం కుప్పకూలింది. ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటు కరీంనగర్ జిల్లాకు చెందిన నేత కార్మికులు నేసిన తివాచీలు, తువ్వాళ్లు, జంపఖానాలు, బెడ్ షీట్లు, తదితర వస్త్ర సామగ్రి పూర్తిగా కాలిబూడిదైంది.
ప్రమాదానికి కారణమదేనా..?:గోదాంలో విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం లేదు. గోదాం చుట్టూ చెత్తా, చెదారం, ఎండిన ఆకులపై ఎవరైనా బీడీ, సిగరెట్ కాల్చి వేయడంతో క్రమంగా మంటలు పెరిగి ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది కొంచెం ముందు వచ్చి ఉంటే ప్రమాద తీవ్రత తగ్గేదని.... గోదాం అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఎండాకాలంలో అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయని.. అందువల్ల గోదాం యజమానులు జాగ్రత్తగా ఉండాలని అగ్నిమాపకశాఖ అధికారులు పేర్కొన్నారు.