ఆధార్ నవీకరణ కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ఏ కేంద్రం వద్ద చూసినా బారులు తీరిన కార్డుదారులే కన్పిస్తున్నారు. ఈకేవైసీ (ఈ వ్యక్తిని నేనే అని ఆధార్ ద్వారా ధ్రువీకరించుకోవడం) చేయించుకుంటేనే వచ్చే నెలలో రేషన్ ఇస్తామని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేయడంతో లక్షలాది మందిలో ఆందోళన మొదలైంది. పిల్లలతో సహా తెల్లవారుజామునే ఆధార్ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. మధ్యాహ్నం వరకు క్యూలైన్లలోనే నిరీక్షిస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఇంకా 60 లక్షల మంది వరకు ఈకేవైసీ ద్వారా ఆధార్ ధ్రువీకరించుకోవాల్సి ఉంది. నాలుగైదు రోజుల్లో 12లక్షల మంది వరకు ఈకేవైసీ పూర్తి చేసుకున్నారు. మిగిలిన వారిలో పెద్దలైతే నెలాఖరులోగా, పిల్లలు సెప్టెంబరు చివర్లోగా ధ్రువీకరణ తీసుకోవాల్సి ఉంది.
ఎందుకింత హడావుడి?
కార్డులోని కుటుంబీకులంతా నిజంగానే ఉన్నారని వాలంటీరు వద్ద ధ్రువీకరించుకోవడమే ఈకేవైసీ ఉద్దేశం. ఇందుకు ఆధార్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. సంబంధిత కుటుంబసభ్యుడు వాలంటీరు వద్ద వేలిముద్ర వేస్తే ఆధార్ సర్వర్‌కు అనుసంధానమై ధ్రువీకరణ పూర్తవుతుంది. వేలిముద్రలు పడకపోతే ఆధార్ కేంద్రానికి వెళ్లి నవీకరించుకోవాలి. వాలంటీరు, రేషన్‌డీలర్ వద్ద ఈకేవైసీ చేయించుకోవాలి. ఐదేళ్లు దాటిన పిల్లల వేలిముద్రలను కొత్తగా నమోదు చేయించుకుంటేనే ఈకేవైసీ పూర్తవుతుంది. వృద్ధులు కూడా తమ వేలిముద్రలు సరిపోకపోతే నవీకరించుకోవాల్సిందే. అయితే కొందరి వేలిముద్రలు బాగానే ఉన్నా వాలంటీర్లు పట్టించుకోకుండా ఆధార్ కేంద్రానికి వెళ్లి నవీకరించుకోమని సూచిస్తున్నారు.
అంతా గందరగోళం
రేషన్‌కు ఈకేవైసీ కోసం రెండేళ్ల కిందట కూడా ఇలాగే హడావుడి కనిపించింది. మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితి పునరావృతమైంది. ఈకేవైసీపై ఒక్కోసారి ఒక్కోమాట చెబుతున్నారు. తొలుత కుటుంబీకులంతా ధ్రువీకరించుకోవాలని చెప్పారు. తర్వాత పెద్దవాళ్లు వేలిముద్ర వేస్తే సరిపోతుందన్నారు. ఇటీవల మళ్లీ కుటుంబీకులంతా ఈకేవైసీ చేయించుకోవాలని స్పష్టం చేస్తున్నారు. పొంతన లేకపోవడంతో అందరిలోనూ గందరగోళం నెలకొంటోంది.
మధ్యాహ్నం రెండింటి వరకు లైన్లలోనే
‘తెల్లవారుజామున వస్తే మధ్యాహ్నం రెండింటి వరకు లైనులో నిలబడాల్సి వచ్చింది. ముందే రిజర్వు చేసుకోమని చెబుతున్నారు. అదెలాగో తెలియడం లేదని’ మంగళగిరినుంచి విజయవాడ కేంద్రానికి వచ్చిన వరలక్ష్మి వాపోయారు. ‘కరోనా భయం పొంచి ఉంది. పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. ఈ సమయంలో ఇంతమంది పిల్లలను ఒకేచోట చేర్చి ఆధార్ పూర్తి చేయించుకోవాల్సి వస్తోంది. భయంభయంగా ఉంది’ అని పలువురు మహిళలు పేర్కొన్నారు. ‘పిల్లలకు ఒకరి తర్వాత ఒకరి వేలిముద్రలు వేయిస్తున్నారు. యంత్రాన్ని శుభ్రం చేయకుండానే ఐరిస్ తీస్తున్నారు’ అని పలువురు వాపోయారు.