Bank theft: ఈ బ్యాంకు చోరీ ఘటన జరిగింది తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాలో. సీన్ ఓపెన్ చేస్తే.. అది బుస్సాపూర్ గ్రామం. మెండోరా మండలంలో ఉంటుంది. ఈ ఊళ్లో.. తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఉంది. ఎప్పుడు ప్లాన్ చేశారో తెలియదు.. ఎన్ని రోజులు రెక్కీ నిర్వహించారో తెలియదు.. మొత్తానికి ప్లాన్ మాత్రం పక్కాగా అమలు చేశారు. నిన్న ఆదివారం కావడంతో బ్యాంకుకు సెలవు వచ్చింది. ఇవాళ (సోమవారం) బ్యాంకు తెరవడానికి వెళ్లిన వారికి.. విషయం తెలిసింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. వారు రంగంలోకి దిగారు. లోనికి వెళ్లి చెక్ చేస్తే.. ఒక్కొక్కటిగా వివరాలన్నీ వెలుగు చూడడం మొదలు పెట్టాయి.
ఈ చోరీ ఘటనలో ఎంత మేది పాల్గొన్నారు అనే విషయంలో క్లారిటీ రాలేదు. ఎంత ఎత్తుకెళ్లారు? ఏమేం దోచుకుపోయారు? అనే లెక్క మాత్రం తేలింది. నగదుతోపాటు బంగారాన్ని కూడా దోచేశారు దుండగులు. డబ్బుల కట్టలు చారెడు.. బంగారం మాత్రం బారెడు సర్దేశారు. బ్యాంకు లాకర్లలో నుంచి రూ.7.22 లక్షల నగుదు కాజేసిన దొంగలు.. రూ.2 కోట్ల విలువైన పసిడి కొట్టేశారు. అయితే.. ఈ చోరీకి దొంగలు అనుసరించిన పద్ధతి అచ్చం జులాయి సినిమాలోని బ్యాంకు దోపిడీ సన్నివేశాలను పోలీ ఉండడం గమనార్హం.