సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి (Venkatrami Reddy) భూ అక్రమాలకు సహకరించారని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. ఆయన 2017లో దక్కన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అధికారిగా పని చేశారని.. ఆ సమయంలో 5 వేల ఎకరాలు ఎవరికి బదిలీ చేశారని ప్రశ్నించారు. 5 వేల ఎకరాల వివరాలు రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచట్లేదన్నారు. వెంకట్రామిరెడ్డి దుబ్బాక ఎన్నికల్లో తెరాసకు సహకరించారని విమర్శించారు. గాంధీ భవన్లో మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.
ప్రాజెక్టుల భూసేకరణలో నిర్వాసితులను వెంకట్రామిరెడ్డి (Venkatrami Reddy) బెదిరించారని రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డిపై అనేక ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. ఆయన వైఖరిపై కాంగ్రెస్ పలుమార్లు ఫిర్యాదులు చేసిందని వెల్లడించారు. వెంకట్రామిరెడ్డిపై వచ్చిన ఫిర్యాదులపై రాష్ట్రాన్ని డీవోపీటీ వివరణ కోరిందని చెప్పారు. కేంద్రం లేఖను రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండిపడ్డారు.