తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండు శాసన మండలి స్థానాల ఓట్ల లెక్కింపు సామాన్యులను కొంత గందరగోళం చేస్తున్నాయి. సాధారణ ఎన్నికల లెక్కింపులో అయితే సమీప ప్రత్యర్ధి కన్నా ఒక్క ఓటు ఎక్కువ వచ్చిన వారే విజేత. కానీ శాసన మండలి లెక్కింపు ఇలా ఉండదు. మొత్తం పోలైన ఓట్లలో సగానికి కంటే ఒకటి ఎక్కువ వస్తేనే గెలిచినట్లు ప్రకటిస్తారు. గత రెండు రోజులుగా రెండు స్థానాల లెక్కింపు సాగుతున్నా.. ఫలితం అర్ధంకాక చాలామంది కొంత తికమక పడుతున్నారు. అసలీ మండలి ఓట్ల లెక్కింపు విధానాన్ని ఒకసారి పరిశీలిద్దాం..
శాసన మండలి ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు విధానం..
మొత్తం చెల్లిన ఓట్లలో సగం కన్నా ఒకటి ఎక్కవ మొదటి ప్రాధాన్యత ఓట్లు వస్తే ఆ అభ్యర్థిని నేరుగా విజేతగా ప్రకటిస్తారు. అలా రాకుంటే ప్రాధాన్యత ఓట్లను ఇలా లెక్కిస్తారు.
ఉదాహరణకు పోలైన ఓట్లలో 15వేల చెల్లిన ఓట్లు అభ్యర్థుల వారీగా ఇలా వస్తే..
1వఅభ్యర్థి - 4,000
2వఅభ్యర్థి - 5,000
3వఅభ్యర్థి - 3,000
4వఅభ్యర్థి - 1,000
5వఅభ్యర్థి - 800
6వఅభ్యర్థి - 1200 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి అనుకుందాము.
ఇందులో ఏ ఒక్క అభ్యర్థికి కూడా 50శాతం కంటే ఎక్కువగా అనగా 7501 ఓట్లు రాలేదు. అందువల్ల ఎవరూ గెలవలేదు. దీంతో ప్రాధాన్యత ఓటింగ్‌లో ఎలిమినేషన్ చేసి ఓట్లు లెక్కిస్తారు.
అంటే ఇందులో 5వ అభ్యర్థికి అందరి కన్నా తక్కువ ఓట్లు వచ్చినందున అతడిని పోటీ నుంచి ఎలిమినేట్ చేస్తారు. అతడికి వచ్చిన 800 ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో వాటిని ఆయా అభ్యర్థులకు పంపిణీ చేస్తారు. పై పట్టికలో 5వ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓట్లు 800 వచ్చాయి. ఆ 800 మంది వేసిన రెండో ప్రాధాన్యత ఓట్లు 1వ అభ్యర్థికి 300, 2వ అభ్యర్థికి 200, 6వ అభ్యర్థికి 100, 4వ అభ్యర్థికి 50, 3వ అభ్యర్థికి 150గా లెక్క పెట్టారు. అప్పుడు
1వఅభ్యర్థికి 4000+300=4300
2వఅభ్యర్థికి 5000+200=5200
3వఅభ్యర్థికి 3000+100=3100
4వఅభ్యర్థికి 1000+50=1,050
6వఅభ్యర్థికి1200+150=1350 ఓట్లు వచ్చాయి.
5వ అభ్యర్థిని తప్పించి అతనికి ఓటు వేసిన వారీ రెండో ప్రాధాన్యతను లెక్కించిన తర్వాత కూడా గెలవడానికి కావాల్సిన 7501 ఓట్లు ఎవరికీ రానందున మళ్లీ మిగిలిన అభ్యర్థుల్లో అందరికంటే తక్కువ ఓట్లు వచ్చిన 4వ అభ్యర్థిని పోటీనుంచి తప్పించి అతడికి వచ్చిన 1000 ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లు 50. మూడో ప్రాధాన్యత ఓట్లను మిగతా నలుగురికి పంపిణీ చేస్తారు.
4వ అభ్యర్థికి వచ్చిన 1000 మొదటి ప్రాధాన్యత ఓట్లలో 1వ అభ్యర్థికి 200, 2వ అభ్యర్థికి 550, 6వ అభ్యర్థికి 100, 3వ అభ్యర్థికి 150 ఓట్లు చొప్పున రెండో ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి అనుకుందాం. అలాగే 4వ అభ్యర్థికి వచ్చిన 50 రెండో ప్రాధాన్యత వారి మూడో ప్రాధాన్యత ఓటును కూడా లెక్కించి మిగిలిన అభ్యర్థులకు బదిలీ చేస్తారు. అలా బదిలీ చేయగా 50 మంది మూడో ప్రాధాన్యత ఓట్లను 1,2,3, 6అభ్యర్థులకు కలుపగా 1వ అభ్యర్థికి 10 ఓట్లు, 2వ అభ్యర్థికి 30, 3వ అభ్యర్థికి 3, 6వ అభ్యర్థికి 7 మూడో ప్రాధాన్యత ఓట్లు వస్తాయి. అప్పుడు మిగిలిన అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ఇలా ఉంటాయి.
1వ అభ్యర్థికి 4300+200+10=4510
2వ అభ్యర్థికి 5200+550+30=5780
3వ అభ్యర్థికి 3100+100+3=3203
6వ అభ్యర్థికి 1350+150+7=1507
ఇలా చేసినా 1,2,3,6అభ్యర్థిల్లో ఎవరికి కూడా గెలుపునకు అవసరమైన 7,501 ఓట్లు ఎవరికి రాలేదు. అందువల్ల పై నలుగురు అభ్యర్థుల్లో అతి తక్కువ ఓట్లు వచ్చిన 6వ అభ్యర్థిని పోటీ నుంచి తొలగించి అతనికి వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లు 1200, రెండో ప్రాధాన్యత ఓట్లు 200, మూడో ప్రాధాన్యత ఓట్లు 7లలో ఉన్న రెండు, మూడు, నాలుగో ప్రాధాన్యత ఓట్లు పొందిన మిగిలిన ముగ్గురు అభ్యర్థులకు పంపిణీ చేస్తారు. ఇలా మొత్తం పోలైన ఓట్లలో ప్రాధాన్యత ఓటు క్రమంలో 50శాతం కంటే ఎక్కువగా అనగా 7501 ఓట్ల కంటే ఎక్కువగా వచ్చే వరకూ లెక్కించి విజేతను ప్రకటిస్తారు.
ఇదీ చదవండి:
ఒంగోలులో రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్య