ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా మానసిక ఆందోళనను ఇలా జయించండి - Covid-19 pandemic in india

మహమ్మారి కరోనా వైరస్‌ దెబ్బకు మానవ జీవనం మెుత్తం స్తంభించిపోయింది. విద్యాసంస్థలు. కార్యాలయాలు, సినిమా హాళ్లు, హోటళ్లు మూతపడ్డాయి. రవాణా వ్యవస్థ ఆగిపోయింది. విజ్ఞానం, వినోదం పంచే టీవీ కార్యక్రమాలకు తెరపడింది. దేశాలకు దేశాలు... దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. కనీస అవసరాలకు మాత్రమే బయటకువస్తూ... రోజంతా ఇంట్లోనే నిర్బంధంగా ఉండాల్సిన పరిస్థితి. ఆరోగ్యంపై అనుమానం వస్తే స్వీయ నిర్బంధం. తప్పని సరైతే క్వారంటైన్‌. ఔషధాలు, వ్యాక్సిన్‌లు లేని కొవిడ్‌19 ప్రభావం ఇంకెంత కాలమో అనే అనిశ్చితికి తోడు... ఎవరిని ఎప్పుడు ఎలా బలి తీసుకుంటుందో అనే భయం అనుక్షణం వెంటాడుతోంది. మానసికంగా బాగా కుంగదీస్తోంది.

how to avoid coronavirus depression
how to avoid coronavirus depression

By

Published : Apr 8, 2020, 8:26 PM IST

మనిషి మెరుగైన జీవనం కోసం ఏర్పాటు చేసుకున్న సమాజంలో ఎటు చూసిన అనుబంధాలే. ఇల్లు, కార్యాలయం, కళాశాల, పరిశ్రమ.. ఎక్కడైనా మనకు సాటి వారితో బంధాలు, బంధుత్వాలు ఉంటూనే ఉంటాయి. ఆనందాన్ని పంచుకోవటానికి, బాధలను తగ్గించుకోవటానికి ఈ బంధాలే కీలకం. ఉద్యోగ, వ్యాపారాల్లో ముందుకు సాగాలంటే.. మనిషికో తోడు అవసరం. ఇప్పుడా బంధాలు, అనుబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది... కరోనా వైరస్‌. ఈ మహమ్మారి దాడి నుంచి కాపాడుకోవటానికి ఇప్పుడు స్వీయ నిర్బంధం తప్పనిసరిగా మారింది. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఎంచుకున్న ఈ మార్గం అత్యవసరమే అయినా మానసికంగా గట్టి దెబ్బే కొడుతోంది. ప్రస్తుతం కరోనా కన్నా దాని నుంచి పుట్టిన భయమే ఎక్కువగా ప్రజల్ని కలవరపెడుతోంది.

20శాతం వరకు పెరిగాయి

కరోనా మహమ్మారి వల్ల కలిగిన భయం... ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు వంటి సమస్యలకు దారితీస్తోంది. ఈ లాక్‌డౌన్ కాలంలో మానసిక సమస్యల బారిన పడిన వారి సంఖ్య 20 శాతం వరకు పెరిగినట్టు ఇండియన్‌ సైక్రియాట్రీ సొసైటీ సర్వే తేల్చి చెప్పింది. మున్ముందు భవిష్యత్తు ఎలా ఉంటుందోనన్న ఆందోళ ఎక్కువమందిలో ప్రధానంగా గుర్తించారు. వ్యాపారాలు పూర్తిగా నిలిచిపోవటం, ప్రైవేట్‌ ఉద్యోగాలు ఉంటాయో పోతాయోననే ఊగిసలాట ఈ ఆందోళనను రెట్టింపు చేస్తోంది. ఆదాయం పూర్తిగా తగ్గిపోవటం సైతం మనిషిని మానసికంగా దెబ్బతీస్తోంది. ఇవన్నీ తీవ్ర భయాందోళనలకు దారి తీస్తాయనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి విపత్కర పరిస్థితిని మానసిక నిబ్బరం కోల్పోకుండా ఎదుర్కోవాలి.

మితిమీరితే ఆందోళనలు

దేశాలకు అతీతంగా ప్రపంచ జనాభా అంతా ఈ కరోనా ఆందోళనలో మునిగిపోయి ఉంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో మానసికంగా ప్రభావం చూపుతున్న ఈ కరోనా ఆందోళనను రెండు రకాలుగా చూడవచ్చు. మెుదటిది కరోనా వైరస్ వల్ల కలిగిన భయం. దీనివల్ల నష్టమూ ఉంది. కొంత లాభముంది. నాకూ కరోనా వస్తుందేమోనన్న భయం... ప్రభుత్వం, నిపుణులు చెప్పిన జాగ్రత్తలను కచ్చితంగా పాటించటానికి ఉపయోగపడుతుంది. ఇంటి పట్టునే ఉండేలా చేసి.. మేలే చేస్తుంది. అదే భయం మితిమీరితే ఆందోళనకు దారితీస్తుంది. నాకేమైనా అయిపోతుందేమో, ఏదైనా అయితే ఏం చెయ్యాలి? ఎవరిని సంప్రదించాలి.. ? ఇంట్లోనే ఉండిపోతే ఇంకేమైనా అవుతుందేమో? వంటి ఆలోచనలు ఆందోళన మరింత పెరిగేలా చేస్తాయి.

చాలా మందిలో ఇదే భయం

ఈ కరోనా ఆందోళన... ఇక్కడితోనే ఆగిపోకపోవచ్చు. మరింత పెరిగి తర్వాత దశకు చేరుకోవచ్చు. ఉన్నట్టుండి తీవ్ర భయాందోళనలు చెలరేగే స్థితిలోకి వెళ్లే ప్రమాదముంది. ఇక రెండో అంశం... అనిశ్చితి. ఎప్పుడేం జరుగుతుందో... ఈ పరిస్థితి ఎక్కడికి దారితీస్తుందో అనే ఆలోచన.. మానసికంగా బాగా కుంగదీస్తుంది. కరోనా వైరస్‌కు ప్రస్తుతానికి టీకా లేదు. ప్రామాణికమైన చికిత్స అందుబాటులో లేదు. ఎప్పుడు తగ్గుతుందో తెలియదు. ఇదే చాలామందిలో భయాందోళనలు రేపుతోంది. పొరపాటున కుటుంబంలో ఎవరికైనా వైరస్ సోకితే.. అది క్షమించరాని తీవ్రమైన తప్పుగా ఇరుగుపొరుగు వెలి వేసినట్టు చూడటం మరింత బాధిస్తోంది. ఎదురుపడ్డప్పుడు పక్కకు జరగటం, మాట్లాడకపోవటం వంటివీ మానసికంగా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇక ఆత్మీయులు మరణిస్తే.. నలుగురు రాలేని దుస్థితి. ఆ బాధ చెప్పలేనిది. కరోనాతో ముడిపడిన ఇలాంటి అనేక అంశాలు.. రకరకాల మానసిక సమస్యలకు కారణవుతున్నాయి.

దురలవాట్లకు లోనయ్యే అవకాశముంది

లాక్‌డౌన్‌ వల్ల ఇళ్లకే పరిమితమవుతున్న సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరిని ఈ కరోనా ఆందోళన వెంటాడుతూనే ఉంది. ఈ ఆందోళన ఎక్కువైతే కుంగుబాటు బారినపడే ప్రమాదముంది. ఇప్పటికే ఒకరకమైన ఆందోళన, కుంగుబాటు సమస్యలతో బాధపడుతున్నవారిలో ఇవి మరింత పెరిగి తీవ్రమైన మానసిక సమస్యలు వచ్చే ప్రమాదం పొంచిఉంది. నిద్ర పట్టకపోవటం, పట్టినా వెంటనే మెలకువ రావటం పెద్ద సమస్య. ఇదిలాగే కొనసాగితే మున్ముందు ఇతరత్రా సమస్యలకూ దారితీస్తుంది. మానసికంగా బలహీనంగా ఉన్నవారు మద్యపానం, సిగరెట్లు కాల్చటం, మత్తుమందులు తీసుకోవటం వంటి దురలవాట్లకు లోనయ్యే అవకాశముంది. దీంతో పాటు తరువాత కోపం, చిరాకు, నలుగురితో కలవలేకపోవటం వంటి సమస్యలు వస్తాయి. గతాన్ని తలచుకొని కుమిలిపోవటం, తీవ్ర ఆందోళన, ఎవరినీ నమ్మకపోవటం, నిద్ర పట్టకపోవటం వంటివి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.

మనసును ప్రశాంతంగా ఉంచండి

కొవిడ్‌-19తో మరణిస్తే ఆయా ఆచారాల పరంగా దహన సంస్కారాలు చేసే వీలు లేదు. దీంతోనూ కుటుంబసభ్యుల్లో ఏదో వెలితి, తమను తాము నిందించుకోవటం వంటి ధోరణులు తలెత్తొచ్చు. ఆత్మీయులను కోల్పోయిన బాధకు ఇవీ తోడైతే నిబ్బరం కోల్పోయి కుంగుబాటులోకీ వెళ్లే ప్రమాదముంది. మన చుట్టూ ఉన్నవారంతా భయాందోళనలకు గురవుతున్నప్పుడు మానసిక స్థైర్యం ఒకింత సడలటం సహజమే. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనో నిబ్బరం కోల్పోకుండా చూసుకోవచ్చు. మనసును ప్రశాంతంగా ఉంచే మార్గాలను వైపు దృష్టి సారించాలి.

ఇలా చేద్దాం...

ఇంటికే పరిమితమైనప్పుడు దినచర్యలో మార్పులు చోటు చేసుకుంటాయి. రోజూ చేసే పనిలో శ్రద్ధ తగ్గుతుంది. వీటికి తావివ్వకుండా చూసుకోవాలి. ఇంటి నుంచి ఆఫీసు పని చేసేవారికి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఆఫీసుకు వెళ్లే రోజుల్లో మాదిరిగా ఉండటానికే ప్రయత్నించాలి. అంతకుముందు మిగిలిపోయిన పనులను పూర్తి చేసుకోవచ్చు. పుస్తకాలు చదువుతూ... కుటుంబసభ్యులతో ఆటపాటలతో కాలక్షేపం చేయవచ్చు. ఇన్నాళ్లు మాట్లాడటం కుదరని ఆత్మీయులతో ఫోన్‌లో సంభాషించవచ్చు. సంగీతం, నాట్యం వంటి అభిరుచులపై దృష్టి పెట్టి సాధన చేయవచ్చు. మొత్తంగా ఏదో ఒక పనిలో నిమగ్నమవటం వల్ల ఆందోళనకు దూరం కావచ్చు. కంటి నిండా నిద్ర పోవాలి. వేళకు భోజనం చేయాలి. ప్రాణాయామం, ధ్యానం మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తాయి. అలాగే ఇంట్లోనే తేలికైన వ్యాయామాలు చేస్తుండాలి. ఇవి ఒత్తిడి తగ్గటానికి తోడ్పడతాయి. ఆందోళనకు, కుంగుబాటుకు లోనుకాకుండా చేస్తాయి.

ABOUT THE AUTHOR

...view details