శేఖర్‌రెడ్డి ఉన్నట్టుండి సచ్చీలుడుగా ఎలా మారారు: లోకేశ్ - ttd board
శేఖర్ రెడ్డిని టీటీడీ బోర్డులోకి తీసుకోవటంపై నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒకప్పుడు శేఖర్ రెడ్డిని అవినీతి అనకొండ అన్న ఓ పత్రిక ఇప్పుడు ఆయన్ను ఆకాశానికెత్తిందని వాగ్బాణాలు సంధించారు.
తితిదే సాక్షిగా జగన్ నీచ రాజకీయం పరాకాష్టకి చేరుకుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ మీడియా ద్వారా శేఖర్ రెడ్డి తనకు బినామీ అని ప్రచారం చేసినట్లు ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. 100 కోట్లు తీసుకుని టీటీడీ పదవి అమ్ముకున్నారని ఆరోపణలు చేశారని అన్నారు. అప్పుడు శేఖర్‌రెడ్డి అవినీతి అనకొండ అని రాసిన పత్రిక తాజాగా చెన్నై ఎడిషన్‌లో అతన్ని ఆకాశానికి ఎత్తిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నట్టుండి శేఖర్ రెడ్డి సచ్చీలుడు, దైవ చింతన ఉన్న వ్యక్తిగా ఎలా మారిపోయారో జగన్ చెప్పాలని ప్రశ్నించారు. 36 మందితో జంబో బోర్డు ఏర్పాటు చేసిన జగన్‌కు స్థానికత, రిజర్వేషన్లు గుర్తురాలేదా అని లోకేశ్ నిలదీశారు. 75 శాతం స్థానికత, 50 శాతం రిజర్వేషన్లు కేవలం ఉత్త మాటలే అని టీటీడీ బోర్డు ఏర్పాటుతో తేలిపోయిందన్నారు. అసెంబ్లీలో బిల్లు పెట్టేప్పుడు గుర్తున్న బీసీలు పదవుల కేటాయింపుల్లో ఎందుకు గుర్తుండటం లేదని ప్రశ్నించారు. టీటీడీని ప్రక్షాళన చెయ్యటం అంటే నల్ల పేపర్లో వార్తలు మార్చడమని ఆలస్యంగా అర్థం చేసుకున్నామని లోకేశ్ దుయ్యబట్టారు. వీటికి సంబంధించిన ఓ పత్రిక క్లిప్లింగ్‌లను నారా లోకేశ్ ట్వీట్ చేశారు.