ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజధాని అమరావతి నిర్మాణానికి ఎంత ఖర్చు చేశారు?: హైకోర్టు - AP HIGH COURT LATEST NEWS

అమరావతి రాజధాని నిర్మాణానికి ఎంత ఖర్చుచేశారు?.. పనులు నిలిచిపోవడం వల్ల జరిగిన నష్టమెంత? తదితర వివరాలు సమర్పించాలని అకౌంటెంట్‌ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది. లేదంటే స్వయంగా విచారణకు రావాలని ఆదేశిస్తామని హెచ్చరించింది. రాజధానితో ముడిపడి ఉన్న వ్యాజ్యాలపై తుది విచారణలో భాగంగా హైకోర్టు ఈ ఆదేశాలిచ్చింది.

ap high court
ap high court

By

Published : Nov 24, 2020, 5:36 AM IST

రాజధాని కోసం భూములిచ్చిన రైతుల హక్కులను హరించేలా చట్టాలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని న్యాయవాది ఉన్నం మురళీధరరావు హైకోర్టులో వాదనలు వినిపించారు. జీవనాధారమైన భూములను రైతులు త్యాగం చేశారని గుర్తు చేశారు. దురుద్దేశంతో తీసుకువచ్చిన పాలనా వికేంద్రీకరణ, సీఆర్​డీఏ రద్దు చట్టాలను రద్దు చేయాలని కోరారు. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీడీఏ రద్దు చట్టాలకు వ‌్యతిరేకంగా అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. రైతుల తరఫున న్యాయవాదులు ఉన్నం మురళీధరరావు, శ్రావణ్ కుమార్ హైకోర్టులో వాదనలు వినిపించారు.

వివరాలు సమర్పించండి

ఇప్పటి వరకు రాజధాని అమరావతి కోసం ఎంత ఖర్చు జరిగింది?.. పనులు నిలిచిపోవడం వల్ల కలిగిన నష్టమెంత?... ఇతర పరిణామాలేంటి? తదితర వివరాలన్నీ మంగళవారం నాటి విచారణలో కోర్టుకు సమర్పించాలని అకౌంటెంట్ జనరల్​కు ధర్మాసనం తేల్చి చెప్పింది. విఫలమైతే స్వయంగా హాజరుకావాలని ఆదేశిస్తామని హెచ్చరించింది . అకౌంటెంట్ జనరల్ వివరాలు సమర్పించకపోతే విజిలెన్స్, ఆదాయపు పన్ను శాఖల విభాగాల నుంచి వివరాలు తెప్పించుకుంటామని స్పష్టంచేసింది. మరికొందరు రైతుల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుదేష్ గుప్తా వాదనల కోసం విచారణ మంగళవారానికి వాయిదా పడింది.

ఆ నిర్ణయం ఏకపక్షం

పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీడీఏ రద్దు చట్టాలను, నిపుణుల కమిటీ నివేదికలను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో న్యాయవాది మురళీధరరావు వాదనలు కొనసాగించారు. 'రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ రైతులు, సాధారణ ప్రజల అభ్యంతరాల్ని పరిగణనలోకి తీసుకోలేదు. అమరావతిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి, అందులో రైతులకు ప్లాట్లు ఇస్తామన్న ఒప్పందానికి విరుద్ధంగా అభివృద్ధిని పక్కనపెట్టి ప్లాట్లు మాత్రమే ఇస్తాం లేదంటే పరిహారంతో సరిపెట్టుకోవాలని చెప్పడం చట్ట విరుద్ధం. రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించడానికి వీల్లేదు. అమరావతి నిర్మాణంలో భాగస్వాములైన రైతులతో సంప్రదించకుండా రాజధాని మార్పు నిర్ణయం ఏకపక్షం. రాజధాని తరలింపులో ప్రభుత్వం దురుద్దేశంతో వ్యవహరిస్తోంది' అని న్యాయవాది మురళీధరరావు వాదనలు వినిపించారు. తన వాదనలకు బలం చేకూరేలా పలు తీర్పులను కోర్టు ముందుంచారు.

కోర్టులు జోక్యం చేసుకోవచ్చు

ఇంకొందరి పిటిషనర్ల తరఫున న్యాయవాది ఉన్నం శ్రావణ్ కుమార్ వాదించారు. 'విధానపరమైన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని ప్రభుత్వం చెబుతోంది. రైతుల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లే సమయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చు. ఏపీ సీఆర్డీఏకు చట్టబద్ధత ఉంది. ఆ చట్టాన్ని అనుసరించే భూములు తీసుకున్నార'ని శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు.

ప్రభుత్వాన్ని వివరణ కోరతాం

మధ్యాహ్న భోజన విరామం తర్వాత పలు వ్యాజ్యాల్లో పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ప్రత్యక్షంగా హాజరుకాకపోవటంతో ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అనంతరం న్యాయవాది మురళీధరరావు వివిధ కమిటీలను ఏర్పాటును సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో వాదనలు వినిపించారు. రాజధానితో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన విశ్రాంత ఐఏఎస్ అధికారి జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికపై అభ్యంతరం తెలిపారు. ముఖ్యమంత్రి ఆకాంక్ష మేరకు కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతుల్ని ఆ కమిటీ సంప్రదించలేదన్నారు. కమిటీ నివేదిక సమర్పించముందే ముఖ్యమంత్రి మూడు రాజధానుల మాటను శాసనసభలో వెల్లడించారన్నారు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) సైతం అదే తరహాలో నివేదిక ఇచ్చిందన్నారు. సమగ్రాభివృద్ధి విషయంలో సూచనలు చేయాలని బీసీజీని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇవ్వలేదన్నారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరతామని ధర్మాసనం పేర్కొంది.

ఇదీ చదవండి

పవిత్రమైన ప్రాంతంలో గోమాతల మరణం.. కారణం అదేనా!

ABOUT THE AUTHOR

...view details