Adulterated Milk: పొద్దున్నే పాలు తాగడం మనలో చాలామందికి అలవాటు. ఆరోగ్యకరమని పిల్లలకు పట్టి మరీ తాగిస్తుంటాం. నాణ్యమైనవైతే నిజంగానే మేలే. కల్తీదైతే అనారోగ్యం‘పాలు’ కావడం తథ్యమని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలోని పలు వ్యవస్థలపై కల్తీ పాలు దుష్ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. పాలలో ఎక్కువగా నీళ్లు, డిటర్జెంట్, గంజి పొడి, యూరియాలను కలుపుతుంటారు. ఇటీవల హైదరాబాద్ నగర శివారులోని పటాన్‌చెరులో పోలీసులు కృత్రిమ పాల తయారీ కేంద్రం గుట్టురట్టు చేయడంతో ఈ సమస్య మరోసారి తెరపైకి వచ్చింది. ఈ పరిస్థితుల్లో పాలు కల్తీ అయ్యాయో లేదో ఇంట్లోనే సులభమైన పద్ధతుల్లో తెలుసుకోవచ్చని ఐఐఎస్ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
పరిశోధన పత్రం ఏమి చెబుతోంది?
స్వచ్ఛమైన పాలు -0.55 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద గడ్డకడతాయి. ఈ ఉష్ణోగ్రత మారిందంటే అందులో నీరు కలిసిందని అర్థం. సగటున లీటరు పాలకు 2 నుంచి 20 శాతం దాకా నీరు కలుపుతున్నారు. ‘లాక్టోమీటరు’ పరికరంలో పాలు పోయగానే అందులో ‘కొవ్వు కాకుండా ఇతర ఘనపదార్థాలు’(ఎస్‌ఎన్‌ఎఫ్) ఎంత శాతం ఉన్నాయో తెలిసిపోతుంది. పాలను వేడి చేసినప్పుడు వచ్చే ఆవిరిలో ఏర్పడే ఘనపు రేణువులు స్ఫటికాల రూపంలో ఘనీభవిస్తే అందులో యూరియా కల్తీ చేశారని కనుగొనవచ్చు.
డిటర్జెంట్ పొడిని కలిపారేమో గుర్తించడానికి.. ఒక గ్లాసులో 10 మి.లీ. పాలు, అంతే మొత్తంలో నీరు పోసి గిరాగిరా తిప్పి బాగా కలపాలి. డిటర్జెంట్ పొడి కలిపి ఉంటే పైన బాగా నురగ వస్తుంది. స్వచ్ఛమైన పాలైతే చాలా స్వల్పంగా నురగ వస్తుంది.
పాలు చిక్కగా కనిపించాలని పిండి పదార్థాలు, గంజిపొడి కలుపుతుంటారు. 2-3 మి.లీ. పాలను ఒక చెంచాలో తీసుకొని.. అంతే మోతాదులో నీళ్లు కలిపి మరగబెట్టి చల్లార్చాలి. అందులో 5 చుక్కలు ‘టించర్ అయోడిన్’ కలపాలి. (ఇది ఔషధ దుకాణాల్లో లభ్యమవుతుంది.) పిండి పదార్థాలు కలిపి ఉంటే.. పాలు నీలి రంగులోకి మారుతాయి. కల్తీ కాకపోతే తెల్లగానే ఉంటాయి.
పాలలో యూరియాను గుర్తించడానికి సులభమైన పద్ధతులున్నాయి. ఔషధ దుకాణాల్లో ‘యూరియాసే స్ట్రిప్స్’ అమ్ముతుంటారు. వాటిపై కొంచెం పాలు పోయాలి. అందులో గీతలు కనిపిస్తే యూరియాతో తయారుచేసిన కృత్రిమ పాలని అర్థం.
నీళ్లు కలిపితే గుర్తించండిలా..
నీరు కలిపారా? లేదా? తెలుసుకోవడానికి.. వాలుగా ఉన్న బండ/చెయ్యిపై పాలు పోయాలి. మెల్లగా కదిలితే అవి స్వచ్ఛమైన పాలు. జరజరా పారితే నీరు కలిపినట్టు లెక్క.
నెయ్యిలో వనస్పతి కల్తీనీ గుర్తించొచ్చు