రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో పడకల మేరకు ఆక్సిజన్ సరఫరా జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కొవిడ్ నివారణ, వ్యాక్సినేషన్‌పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. భవిష్యత్తులో ఆక్సిజన్ కొరత రాకుండా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.
ఆక్సిజన్ వినియోగం 600 టన్నులు దాటింది..
ప్రస్తుతం రోజుకు ఆక్సిజన్ వినియోగం 600 టన్నులు దాటిందని సీఎం జగన్ వివరించారు. 300 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి... ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో రోగుల అవసరాలను తీర్చేలా ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించాలని స్పష్టం చేశారు. కృష్ణపట్నం లేదా కడపలో మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
ఆక్సిజన్ కోసం నేవీ, సాంకేతిక సహకారం..
ఏప్రిల్ 20 నాటికి 360 మెట్రిక్ టన్నుల కేటాయింపు ఉండేదని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుత వినియోగం 600 మెట్రిక్ టన్నులకు పైగా చేరిందని, ప్రస్తుతానికి కేటాయింపులు 590 టన్నుల వరకూ ఉన్నాయని సీఎంకు తెలిపారు. ప్రత్నామ్నాయ విధానాల ద్వారా లోటు అధిగమించే యత్నం జరుగుతోందని... వివిధ జిల్లాలకు 8 క్రయోజనిక్ ట్యాంకులు పంపిణీ చేశామని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. ద్రవ ఆక్సిజన్ సరఫరా వాహనాలను 56 నుంచి 78కి పెంచామని ఆఫీసర్లు సీఎంకు వివరించారు. అందరికీ సమ రీతిలో ఆక్సిజన్ కోసం నేవీ, సాంకేతిక సహకారం తీసుకోవాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.