రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితుల్లో జూన్/జులై నుంచి క్రమంగా పెరిగే వర్షాల వల్ల మలేరియా, డెంగీ జ్వరాలతో పాటు స్వైన్‌ఫ్లూ, గున్యా, టైఫాయిడ్, కామెర్లు, డయేరియా వంటి వ్యాధుల వ్యాప్తికి అవకాశాలు ఉన్నాయి. పలు వ్యాధులకు దగ్గు, జలుబు, జ్వరం వంటి ఫ్లూ లక్షణాలు కనిపిస్తాయి. కొవిడ్‌కు కూడా కొన్ని లక్షణాలు అవే ఉండటంతో ప్రజలు ఏది కరోనాయో..ఏది ఫ్లూ జ్వరమో తెలియక ఇబ్బందిపడే అవకాశం ఉంది.
రంగంలోకి వైద్య ఆరోగ్య శాఖ
లాక్‌డౌన్ ఆంక్షలు సడలించినందున రానున్న సెప్టెంబరు వరకు పెరిగే కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని వైద్య ఆరోగ్య శాఖ తగిన చర్యలు తీసుకుంటోంది. ఇదే సమయంలో.. ప్రతి ఏటా వర్షాకాలంలో వచ్చే మలేరియా, డెంగీ జ్వరాల నియంత్రణపైనా దృష్టి పెట్టింది. నేటి నుంచి ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటి సర్వేను ప్రారంభించనున్నారు. ఈ సమయంలో కొవిడ్ అనుమానిత లక్షణాల గురించే కాకుండా.. సీజనల్‌గా వచ్చే ఇతర వ్యాధులకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా అవగాహన కల్పిస్తారు.
ఈ చర్యలు అవసరం..
- గతేడాది డెంగీ, మలేరియా జ్వరాలు ఎక్కువగా నమోదైన ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.
- తాగునీరు కలుషితం కాకుండా సరఫరా పైపులైన్ల మరమ్మతుల విషయంలో పంచాయతీ, పురపాలక సిబ్బంది అవసరమైన చర్యలను ఇప్పటి నుంచే మొదలుపెట్టాల్సి ఉంది.