ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

SUCHARITA: రాష్ట్రంలో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గింది: హోం మంత్రి సుచరిత - హోం మంత్రి సుచరిత

రాష్ట్రంలో మావోయిస్టుల సంఖ్య, ప్రాబల్యం తగ్గిందని హోం మంత్రి సుచరిత తెలిపారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా మారుమూల ప్రాంతాలకు సైతం ప్రభుత్వ పథకాలు చేరటం వల్లనే ఇది సాధ్యమైందని ఆమె అన్నారు.

SUCHARITA
SUCHARITA

By

Published : Sep 27, 2021, 5:00 AM IST

రాష్ట్రంలో మావోయిస్టుల ప్రాబల్యం 5 జిల్లాల నుంచి 2 జిల్లాలకు తగ్గిందని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత(home minister sucharita in meeting with union home minister) తెలిపారు. మావోయిస్టుల సంఖ్య కూడా 50కి పరిమితమైనట్లు చెప్పారు. ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామ సచివాలయం, వాలంటీర్‌ వ్యవస్థ ద్వారా మారుమూల ప్రాంతాలకూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తీసుకెళ్లారని, దాని వల్ల ఈ సుదీర్ఘ సమస్య క్రమంగా తగ్గుతోందన్నారు. దిల్లీలో ఆదివారం జరిగిన మావోయిస్టుల ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి సీఎం జగన్‌ రాలేకపోవడంతో రాష్ట్రం తరఫున హోంమంత్రి సుచరిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌లు హాజరయ్యారు. అనంతరం ఆమె విలేకర్లతో మాట్లాడారు.

‘ఏపీలో మావోయిస్టుల ప్రభావం ప్రస్తుతం విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో మాత్రమే కొంత కనిపిస్తోంది. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి 45-60 ఏళ్ల వరకు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు నాలుగేళ్లలో ముఖ్యమంత్రి రూ.70వేలు చొప్పున అందిస్తున్నారు. దీనివల్ల మహిళలు తమ బిడ్డలను చదివించుకుంటున్నందున ఈ సమస్యకు పరిష్కారం లభిస్తోంది. తాజా సమావేశంలో మారుమూల ప్రాంతాలకు రహదారి సౌకర్యం కల్పించాలని కోరాం. అటవీప్రాంతాల్లో రహదారుల నిర్మాణాలు చేపట్టడానికి అటవీ అనుమతులు ఇవ్వాలని, ఏకలవ్య విద్యాలయాల సంఖ్య పెంచాలని అడిగాం. మారుమూల ప్రాంతాలకు 4జీ ఇంటర్‌నెట్‌ సౌకర్యం కల్పించాలని, కొన్నిచోట్ల అదనపు బెటాలియన్లు కావాలని విజ్ఞప్తి చేశాం. ఏపీ-ఒడిశా సరిహద్దుల్లో ఏర్పాటు చేసే గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రానికి సాయం కోరాం. మారుమూల ప్రాంతాల్లో 3 కిలోమీటర్లకో పోస్టాఫీసు ఏర్పాటు చేయాలని, రెల్లిలో తలపెట్టిన గిరిజన యూనివర్సిటీని సాలూరుకు మార్చమని కోరాం. రాష్ట్రంలో బాక్సైట్‌ తవ్వకాలు చేపట్టనందున ఒడిశా నుంచి ఖనిజం ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం. ఈ కార్యక్రమాలు చేస్తే మావోయిస్టుల ప్రభావం తగ్గుతుందని భావిస్తున్నాం. అయితే రాష్ట్రంలో మావోయిస్టుల సమస్య పూర్తిగా సమసిపోయిందని భావించడానికి లేదు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. రాబోయే రోజుల్లో రాష్ట్రానికి పూర్తి సాయం చేస్తారని ఆశిస్తున్నాం’ అని ఆమె పేర్కొన్నారు.

విశాఖ జిల్లాలో మావోయిస్టుల ప్రాబల్యం ఉన్నందున రాజధాని అంశానికి సమస్యగా మారుతుందేమోనన్న ప్రశ్నకు బదులిస్తూ ఏపీ, ఒడిశా సరిహద్దుల్లో ఎప్పటినుంచో వారి సమస్య ఉందని, రాజధానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదన్నారు. ఇటీవల పట్టుబడిన హెరాయిన్‌తో రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేదని హోంమంత్రి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘చిన్న ఇంట్లో ట్రేడింగ్‌ కంపెనీ రిజిస్టర్‌ చేసుకున్నారు. అక్కడి నుంచి కార్యకలాపాలు లేవని, వాళ్లు చెన్నైకి వెళ్లి అక్కడే ఉంటున్నట్లు మీడియాలోనూ వార్తలు వచ్చాయి. అందువల్ల దీంతో రాష్ట్రానికి సంబంధంలేదు. చిన్న ట్రేడింగ్‌ కంపెనీ పెట్టుకున్నంత మాత్రాన అక్కడ కార్యకలాపాలు చేస్తున్నారా అన్నది చూడాలి’ అని వివరించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా విచారణ చేపడుతుందా అన్న ప్రశ్నకు బదులిస్తూ తప్పకుండా చేపడుతుందన్నారు. చాలా పెద్ద ఎత్తున జరిగినందున కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

ఇదీ చదవండి:

GOLD DEPOSITS: ‘అనంత’లో 16 టన్నుల బంగారం

ABOUT THE AUTHOR

...view details