GVL in Holi celebrations: విజయవాడలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు నివాసంలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. భాజపా నేతలు, కార్యకర్తలు కలిసి జీవీఎల్ హోలీ సంబరాలు జరుపుకున్నారు. రంగులు జల్లుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
విశాఖలో సీఆర్పీఎఫ్ పోలీసుల హోలీ సంబరాలు
Holi celebrations in visakha: విశాఖ జిల్లా పాడేరులో సీఆర్పీఎఫ్ -234 బెటాలియన్ పోలీసులు హోలీ సంబరాలు జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుని ఆనందంగా ఆడిపాడారు. దేశం నలుమూలల నుంచి వచ్చి విధుల్లో తలమునలకలైన సీఆర్పీఎఫ్ పోలీసులు.. సోదర, స్నేహ భావంతో ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. డప్పు వాయిద్యాలు, మేళతాళాలు వాయిస్తూ... నృత్యాలు చేశారు. శుభాకాంక్షలు చెప్పుకొంటూ... ఉత్సాహంగా గడిపారు. అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.
కర్నూలు హోలీ వేడుకల్లో వింత ఆచారం...
కర్నూలు జిల్లాలో హోలీ రోజున వింత ఆచారం కొనసాగుతోంది. ఆదోని మండలం సంతేకుడ్లుర్ గ్రామంలో హోలీ రోజున పురుషులు.. ఆడ వేషం ధరించి రతి మన్మధులను పూజించారు. హోలీ పండుగ వచ్చిందంటే.. జంబలకడిపంబ తరహాలో వింత ఆచారం కొనసాగుతోంది. తరతారాల నుంచి ఈ ఆచారం కొనసాగుతుందని.. ఇలా ధరించడం వల్ల కోరికలు తీరుతాయని భక్తులు తెలిపారు. ఇలా పూజించడం వల్ల పంటలు బాగా పండుతాయని... గ్రామానికి కష్టాలు రాకుండా ఉంటాయని నమ్ముతారు. అందుకే ప్రతి ఏడాది హోలీ పండుగకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు.. ఈ వింత ఆచారాన్ని చూడటానికి భారీ ఎత్తున తరలి వస్తారని తెలిపారు.