అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో పురావస్తు శాఖ అధికారుల బృందం చారిత్రాత్మక ఆనవాళ్లపై పరిశోధనలు జరిపారు. ఇందులో భాగంగా నీలకంఠాపురం గ్రామంలో... మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సమాచారం మేరకు చరిత్రకారుడు, ఇంటాక్ పీఈవో డాక్టర్ శివనాగిరెడ్డి బృందం పర్యటించింది. నీలకంఠాపురం సమీపంలోని చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శించి పలు విగ్రహాలు, మట్టి పాత్రలు, శాతవాహన కాలపు కుండ పెంకులు, ఇటుక రాతి ముక్కలు, వెలికి తీశారు.
మునీశ్వరస్వామి దేవాలయం వద్ద క్రీస్తుశకం 16వ శతాబ్దం నాటి సూర్య విగ్రహం, అభయాంజనేయస్వామి ఆలయంలోని విగ్రహాలను నిశితంగా పరిశీలించారు. అనంతరం రొళ్ల మండలం రత్నగిరి, అమరాపురం మండలం హేమావతి చారిత్రాత్మక ఆలయాలను సందర్శించారు. రానున్న రెండు నెలల్లో నూతన ఆలయ ప్రారంభం రోజున గ్రామ చరిత్రపై పుస్తకాన్ని ఆవిష్కరిస్తామని రఘువీరారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా పురావస్తు శాఖ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.