ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైదరాబాద్​ను వణికిస్తున్న కరోనా... జీహెచ్​ఎంసీలో 62శాతం కేసులు - తెలంగాణ వార్తలు

భాగ్యనగరంలో కరోనా మహమ్మారి పడగ విప్పుతోంది. జూన్‌ 21 నాటికి తెలంగాణలో నమోదైన మొత్తం కేసుల్లో ఒక్క రాజధానిలోనే 62 శాతం వైరస్‌ పాజిటివ్‌గా తేలాయి. మొత్తం మరణాల్లో 80 శాతం హైదరాబాద్‌లోని నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.

highly-corona-positive-cases-registered-in-hyderabad
హైదరాబాద్​ను వణికిస్తున్న కరోనా

By

Published : Jun 24, 2020, 7:36 AM IST

హైదరాబాద్​లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ నెల 21 నాటికి తెలంగాణలో నమోదైన మొత్తం కేసుల్లో (7,802) ఒక్క హైదరాబాద్‌లోనే 62 శాతం (4,868 పాజిటివ్‌లు) ఉండడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం కరోనా మరణాల్లోనూ దాదాపు 80 శాతం హైదరాబాద్‌లోనే నమోదవడం పరిస్థితి తీవ్రతను చెబుతోంది. నానాటికీ విజృంభిస్తున్న వైరస్‌ను అడ్డుకోవడం స్వీయ నియంత్రణతోనే సాధ్యమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్‌ (567), బంజారాహిల్స్‌ (317), గోషామహల్‌ (677), పంజాగుట్ట (216) ప్రాంతాల్లో కలుపుకొని పశ్చిమ మండలం పరిధిలో అత్యధికంగా 36.50 శాతం (1,777) కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత దక్షిణ మండలంలో ఎక్కువ కేసులు వచ్చాయి. దక్షిణ మండలంలో 87 మంది మృత్యువాత పడగా.. పశ్చిమ మండలంలో 67 మంది మృతి చెందారు. బాధితుల్లో పురుషులు 62.36 శాతం (3,036 మంది) ఉండగా.. మహిళలు 27.64 శాతం (1,832) మంది ఉన్నారు.

లాక్‌డౌన్‌ అనంతరం ఉద్ధృతి:

తెలంగాణలో తొలికేసు మార్చి 2న నమోదైంది. దుబాయి నుంచి వచ్చిన హైదరాబాద్‌కు చెందిన యువకుడిలో వైరస్‌ను గుర్తించారు. మర్కజ్‌కు వెళ్లొచ్చిన ఖైరతాబాద్‌కు చెందిన వృద్ధుడు తొలిసారి కొవిడ్‌తో మరణించారు. లాక్‌డౌన్‌ అమలు దశలో రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో వైరస్‌ జాడలు తగ్గుముఖం పట్టినా.. హైదరాబాద్‌లో చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉంది. గత నెల 16 నుంచి లాక్‌డౌన్‌ సడలింపులు, ఈనెల 1 నుంచి లాక్‌డౌన్‌ ఎత్తివేత అనంతరం కరోనా ఉద్ధృతి తీవ్రమైంది. ఇప్పటి వరకూ హైదరాబాద్‌లో నమోదైన మొత్తం కేసుల్లో దాదాపు 50 శాతం పాజిటివ్‌లు లాక్‌డౌన్‌ సడలింపుల అనంతరమే వస్తుండడం గమనార్హం. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారులు వృత్తి, ఉపాధి రీత్యా రాకపోకలు కొనసాగిస్తుండడం వల్ల కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈనెల ప్రారంభం నుంచి నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచినందున.. కేసుల నమోదు అనూహ్యంగా పెరిగింది. ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ పరిధిలో 50,000 నమూనాలను పరీక్షించాలని ఆదేశాలు జారీచేయడం వల్ల.. రోజుకు సుమారు 2,500-3,000 వరకూ నమూనాలను పరీక్షిస్తున్నారు.

కట్టడి మన చేతుల్లోనే:

హైదరాబాద్​లో కరోనాను వ్యాప్తి కట్టడి కోసం ప్రభుత్వం కంటైన్‌మెంటు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలను కొనసాగిస్తోంది. ఇప్పటికీ హైదరాబాద్‌లో 154 కంటైన్​మెంట్​‌ ప్రాంతాలు ఉన్నాయి. తూర్పు మండలంలో ఒక్క ప్రాంతం లేదు. పశ్చిమ, ఉత్తర, దక్షిణ జోన్లలోనే ఎక్కువగా ఉన్నాయి. పశ్చిమ మండలంలో 16 చోట్ల రాత్రివేళ తనిఖీ కేంద్రాలను అమలు చేస్తున్నారు. వేగంగా విస్తరిస్తున్న వైరస్‌ను కట్డడికి ప్రజల సహకారం అవసరమని నిపుణులు చెబుతున్నారు.

పైరవీలుంటేనే ప్రైవేటు ఆసుపత్రిలో పడక:

హైదరాబాద్‌లోని కొన్ని కార్పొరేట్‌ ఆసుపత్రుల్లోనే ప్రైవేటుగా కరోనా చికిత్స అందుబాటులో ఉండడం వల్ల.. జిల్లాల్లో అనుమానితులు కొందరు చికిత్స కోసం ఇక్కడికే వస్తున్నారు. ఈనెల 21 నాటికి గాంధీ ఆసుపత్రిలో 535 మంది చికిత్స పొందుతుండగా.. ప్రకృతి వైద్యశాలలో 217 మంది ఉన్నారు. ప్రైవేటుగా 465 మంది చికిత్స పొందుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రులు కరోనా అనుమానితులతో కిటకిటలాడుతున్నాయి. కొన్ని ఆసుపత్రుల్లో పైరవీ చేయించుకుంటే తప్ప పడక దొరకని పరిస్థితి ఇప్పుడే ఉందంటే.. మున్ముందు మరిన్ని కేసులు పెరిగితే పరిస్థితి ఏమిటన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇవీచూడండి:ఔషధ మొక్కలపై పరిశోధనకు ఇదే సరైన సమయం: గవర్నర్

ABOUT THE AUTHOR

...view details