రాష్ట్రంలో కరోనా తీవ్రత విద్యార్థులకు సంకటంగా మారింది. ఇప్పటికే 1 నుంచి 9 తరగతుల విద్యార్థులకు సెలవులు ప్రకటించారు. వారికి ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతులకు పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. పది, ఇంటర్ పరీక్షలు యథాతథంగా నిర్వహించేందుకు సర్కారు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే పలు విశ్వవిద్యాలయాల్లో కరోనా కేసులు వెలుగు చూస్తుండగా.. కొన్ని చోట్ల వసతి గృహాలను మూసివేశారు. తరగతుల నిర్వహణ ఎలా అనే సందిగ్ధత నెలకొంది.
5 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు
మరోవైపు.. ఇంటర్ థియరీ పరీక్షలు మే 5న ప్రారంభమై 23తో ముగుస్తాయి. ఈ ఏడాది 10,66,493 మంది ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాల్లో 20 మంది విద్యార్థులకు ఒక్కో గది చొప్పున కేటాయిస్తారు. కొవిడ్ అనుమానిత లక్షణాలు ఉండే విద్యార్థుల కోసం థియరీ పరీక్ష కేంద్రాల్లో ప్రత్యేకంగా గదులను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో విధులకు హాజరయ్యే ఇన్విజిలేటర్లకు పీపీఈ కిట్లను అందించనున్నారు.
షెడ్యూల్ ప్రకారం విద్యాసంవత్సరం పూర్తి చేసే ఆలోచనలో విద్యామండలి
ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉన్నత విద్య కోసం కళాశాలల్లో చేరాల్సి ఉన్నందున షెడ్యూల్ ప్రకారం విద్యాసంవత్సరం పూర్తి చేయాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. వివిధ ఉద్యోగాల్లో చేరే అభ్యర్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నందున వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యాసంవత్సరం కొనసాగిస్తామని స్పష్టం చేస్తోంది. కరోనా తీవ్రత పెరిగినా తరగతలు ఎలా కొనసాగించాలి, పరీక్షలు ఎలా నిర్వహించాలనేదానిపై త్వరలోనే వీసీలతో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోనుంది.