ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దర్యాప్తు నిలుపుదల సరికాదు- హైకోర్టు - dhulipalla narendra lates news

ధూళిపాళ్ల రిమాండ్ అంశంపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. నరేంద్ర వేసిన పిటిషన్​ను కొట్టివేసిన హైకోర్టు.. కేసుపై పూర్తి వివరాలతో కౌంటర్ అఫడవిట్ దాఖలు చేయాలని అనిశాను ఆదేశించింది.

dhulipalla
ధూళిపాళ్ల నరేంద్ర పిటిషన్ కొట్టేసిన హైకోర్టు

By

Published : Apr 29, 2021, 12:21 PM IST

Updated : Apr 30, 2021, 7:03 AM IST

సంగం డెయిరీ ఛైర్మన్‌, తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌, ఎండీ పి.గోపాలకృష్ణన్‌పై అవినీతి నిరోధక శాఖ (అనిశా) నమోదుచేసిన కేసు దర్యాప్తును ఈ దశలో నిలుపుదల చేయడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. అనుబంధ పిటిషన్లో తదుపరి ఉత్తర్వులకు లోబడి దర్యాప్తును కొనసాగించేందుకు అనుమతి ఇచ్చింది. కౌంటర్‌ దాఖలు చేయాలని అనిశాను ఆదేశించింది. విచారణను మే 5కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావు గురువారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. పరిపాలనాపరమైన, ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డామనే ఆరోపణతో ఈనెల 22న అనిశా తమపై నమోదుచేసిన కేసును కొట్టేయాలని కోరుతూ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌, పి.గోపాలకృష్ణన్‌ హైకోర్టు ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై వాదనలు ముగియడంతో న్యాయమూర్తి గురువారం తన నిర్ణయాన్ని ప్రకటించారు.

పలు విషయాల్లో స్పష్టత అవసరం
ఈ అంశంలో ఓ నిర్ణయానికి రావడానికి పలు విషయాల్లో స్పష్టత రావాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తి పేర్కొన్నారు. ప్రభుత్వం పేరున ఎంత భూమి సేకరించారు? ఎంత భూమి గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కో-ఆపరేటివ్‌ యూనియన్‌ లిమిటెడ్‌ (జీడీఎంపీఎంఏసీయూఎల్‌)కు అప్పగించారనే విషయం తేలాల్సి ఉందన్నారు. ‘ఆసుపత్రి ఏర్పాటు కోసం ట్రస్టు పేరున 10 ఎకరాల భూమి బదిలీ చేయడం ద్వారా ధూళిపాళ్ల నరేంద్రకు ఏమైనా లబ్ధి చేకూరిందా? భూములు తనఖా పెట్టి జీడీఎంపీఎంఏసీయూఎల్‌ నిధులు సమకూర్చే క్రమంలో ఆయన ఎలా ప్రయోజనం పొందుతారు? సహకార సంఘం నుంచి మ్యూచువల్లీ ఎయిడెడ్‌ సహకార సంఘం, ఆ తర్వాత కంపెనీ చట్టంలోకి మారే క్రమంలో ప్రభుత్వ ఆస్తులు కంపెనీకి దఖలుపడ్డాయా లేదా అనే విషయంపై స్పష్టత రావాలి. దర్యాప్తు ప్రారంభదశలో ఉందని ఏజీ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు నిలుపుదల సరికాదని అభిప్రాయపడుతున్నాం’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.

రిమాండ్‌పై వేసిన వ్యాజ్యం కొట్టివేత
మరోవైపు జ్యుడీషియల్‌ రిమాండ్‌కు పంపుతూ విజయవాడలోని ఇంఛార్జి అనిశా కోర్టు ఈనెల 23న జారీచేసిన ఉత్తర్వులను... బెయిలు కోసం ధూళిపాళ్ల నరేంద్ర, గోపాలకృష్ణన్‌ దాఖలు చేసిన మరో వ్యాజ్యాన్ని న్యాయమూర్తి కొట్టేశారు.

ఇదీ చదవండి:ధూళిపాళ్ల నరేంద్రను విచారించిన అ.ని.శా. అధికారులు

Last Updated : Apr 30, 2021, 7:03 AM IST

ABOUT THE AUTHOR

...view details