High Courts on release of life prisoners తన భర్త పార్థమరెడ్డిని హత్య చేసి జీవిత ఖైదు అనుభవిస్తున్న 8 మంది నేరస్థులను స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా క్షమాభిక్షపై విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మెట్టు గ్రామానికి చెందిన ముడి నవనీతమ్మ హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే నేరస్థులకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ గత ఏడాది ఆగస్టు 15న ప్రభుత్వం వారిని విడుదల చేయబోగా ఆమె అభ్యంతరం తెలుపుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. అప్పట్లో ఆ ప్రక్రియ ఆగిపోయింది. తిరిగి ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 15న వారిని విడుదల చేసింది. దీంతో ఆమె అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. క్షమాభిక్ష కింద బయటకు వచ్చిన పుచ్చలపల్లి నరేశ్‌రెడ్డి, కొండూరు దయాకర్‌రెడ్డి, పుచ్చలపల్లి శ్రీనివాసులురెడ్డి, పుచ్చలపల్లి నిరంజన్‌రెడ్డి, పుచ్చలపల్లి సుబ్రమణ్యంరెడ్డి, యల్లసిరి మస్తాన్, కలతూరు సుధాకర్‌రెడ్డి, చెన్నూరు వెంకటరమణారెడ్డిలను తిరిగి జైలుకు పంపాలని కోరారు.
High Courts జీవిత ఖైదీల విడుదలపై హైకోర్టు ఆక్షేపణ - జీవిత ఖైదీల విడుదలపై ఏపీ హైకోర్టు అభ్యంతరం
High Courts on release of life prisoners హత్య కేసులో జీవిత ఖైదు పడిన నేరస్థులను కనీసం 14 ఏళ్ల శిక్ష పూర్తికాకుండానే క్షమాభిక్ష కింద విడుదల చేయడంపై హైకోర్టు ఆక్షేపణ తెలిపింది. నిబంధనలు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం జీవితఖైదు పడిన వారు కనీసం 14 ఏళ్లు జైలు జీవితం అనుభవిస్తేనే క్షమాభిక్షకు అర్హులని తెలిపింది. ప్రభుత్వ ఆదేశాలను పరిశీలిస్తే ఈ శిక్షను కుదించినట్లుందని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై వాదనలు వినిపించాలని స్పష్టంచేస్తూ విచారణను ఈనెల 25కి వాయిదా వేసింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది గూడపాటి వెంకటేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. దోషుల్లో కొందరు 8 ఏళ్లు, మరికొందరు 11 ఏళ్ల శిక్ష పూర్తి చేసుకున్నారని తెలిపారు. కనీసం 14 ఏళ్ల శిక్ష అనుభవించకుండా విడుదల చేశారని తెలిపారు. దీనికి ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. గవర్నర్ అధికారాల మేరకే ఖైదీల విడుదలకు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఆ వాదనలను తోసిపుచ్చిన న్యాయమూర్తి.. జీవిత ఖైదు శిక్ష పడిన వారు కనీసం 14 ఏళ్ల జైలు జీవితం అనుభవించడంతో పాటు, సత్ప్రవర్తన కలిగి ఉంటేనే క్షమాభిక్షకు అర్హులన్నారు. పూర్తి వివరాలతో వాదనలు చెప్పేందుకు సిద్ధపడి రావాలని సూచిస్తూ విచారణను ఈనెల 25కి వాయిదా వేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్.మానవేంద్రనాథ్‌రాయ్ సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు.
ఇవీ చదవండి: