వాహనాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ నిత్యావసరాల పంపిణీని తాత్కాలికంగా నిలిపివేస్తూ.... జనవరి 28న ఎస్ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ.... పౌరసరఫరాలశాఖ కార్యదర్శి శశిధర్ అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ కార్యక్రమాన్ని జూన్ 2019లోనే శాసనసభలో ప్రకటించారని... ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదించారు. ఈ ఏడాది జనవరి 21న ముఖ్యమంత్రి ఆ వాహనాలను ప్రారంభించారన్నారు. ఈ పథకం సంబంధిత వివరాల సమర్పణకు ఎస్ఈసీ నోటీసు పంపగా... సీఎస్ వాటిని అందించారని.... అయినా సరకుల పంపిణీ ప్రారంభాన్ని నిలువరిస్తూ ఉత్తర్వులిచ్చారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఎస్ఈసీ నిర్ణయం ప్రజాహితం ప్రకారం లేదన్నారు. ప్రజాహితాన్ని దృష్టిలో పెట్టుకుని.... ప్రవర్తన నియమావళి క్లాజ్(2) ప్రకారం అనుమతి ఇవ్వొచ్చన్నారు. పంచాయతీ ఎన్నికలు రాజకీయ పార్టీల రహితంగా జరిగేవన్నారు.
ఫిర్యాదులు అందాయి..
ఇంటింటికీ సరకుల పంపిణీ ప్రభావం, బలహీనవర్గాలకు ప్రయోజనం తదితర వివరాలను ఎస్ఈసీ పరిగణనలోకి తీసుకుంటుందని.. ఎస్ఈసీ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్ వాదనలు వినిపించారు. అధికార పార్టీకి చెందిన రంగులున్న వాహనాలను పంపిణీకి వినియోగించడంపై వివిధ రాజకీయ పక్షాల నుంచి ఫిర్యాదులు అందాయన్నారు. ఈ నేపథ్యంలోనే పరిశీలన కోసం పంపిణీని వాయిదా వేశారన్నారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి.... ఎన్నికల కోడ్‌ను పరిశీలించారు. కొత్త, పాత పథకాలపై ఎస్ఈసీ షరతులు, నిషేధం విధించడాన్ని తప్పుపట్టలేమన్నారు. అయితే ఆ సమయంలో... పథకం స్వభావం, కొనసాగింపునకు ఉన్న ఆవశ్యకత, ప్రజాప్రయోజనానికి విరుద్ధమా? కాదా? వంటి విషయాలపై దృష్టి పెట్టాలన్నారు. పూర్తిస్థాయి నిషేధం విధించడం కన్నా.... రాజకీయ నేతలతో ప్రమేయం లేకుండా.... అభిమానుల ఉత్సవాలకు తావివ్వకుండా అధికార యంత్రాంగంతో ఆ పథక అమలుపై ఎస్ఈసీ దృష్టి పెట్టొచ్చన్నారు. ప్రజాపంపిణీ పథకం... ప్రజా అవసరాల్ని తీర్చేది అనడంలో సందేహం లేదన్నారు. సంక్షేమ పథకాలు రాజకీయ పార్టీల దాతృత్వంతో చేపట్టేవి కావని.. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులతో ఆ పథకాల లబ్ధిదారులు సమానంగా ఆర్థికాభివృద్ధి సాధించడం కోసమేనన్నారు.