HIGH COURT SERIOUS రాష్ట్రంలో సలహాదారుల నియామకాలపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. సలహాదారులు రాజ్యాంగేతర శక్తుల్లా వ్యవహరిస్తున్నారంటూ మండిపడింది. మంత్రులకు సలహాదారులను నియమిస్తే అర్థం చేసుకోగలం కానీ.. ప్రభుత్వ శాఖలకు సలహాదారులేమిటని నిలదీసింది. ఇలా సలహాదారులను నియమిస్తున్నారంటే ప్రభుత్వంలో అధికారుల కొరతేమైనా ఉందా అని ప్రశ్నించింది. దేవాదాయశాఖకు సలహాదారుగా అనంతపురం జిల్లాకు చెందిన జ్వాలాపురపు శ్రీకాంత్‌ను నియమిస్తూ జారీ చేసిన జీవోపై స్టే విధించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
శ్రీకాంత్ నియామకంపై హైకోర్టు ఆగ్రహం, రాజ్యాంగేతర శక్తుల్లా సలహాదారులని వ్యాఖ్య - high court serious on Srikanth appointment
![శ్రీకాంత్ నియామకంపై హైకోర్టు ఆగ్రహం, రాజ్యాంగేతర శక్తుల్లా సలహాదారులని వ్యాఖ్య HIGH COURT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16183794-520-16183794-1661326181991.jpg)
12:27 August 24
మంత్రులకు సలహాదారులు ఉంటే అర్థం ఉందన్న హైకోర్టు
జ్వాలాపురపు శ్రీకాంత్‌ను దేవాదాయశాఖకు సలహాదారుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 5న జీవో 630 జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధికార ప్రతినిధి హెచ్‌కే రాజశేఖరరావు హైకోర్టులో పిల్ వేశారు. జీవో 630ను దేవాదాయ చట్ట నిబంధనలకు విరుద్ధమైనదిగా ప్రకటించి, రద్దు చేయాలని కోరారు. శ్రీకాంత్‌కు ఏ రకమైన అర్హత, నైపుణ్యం ఉన్నాయో నియామక ఉత్తర్వుల్లో పేర్కొనలేదన్నారు. బుధవారం ఈ వ్యాజ్యం విచారణకు వచ్చినప్పుడు పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ.. జ్వాలాపురపు శ్రీకాంత్‌ను దేవాదాయశాఖకు సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఆయనకు ప్రొటోకాల్‌తో కూడిన సౌకర్యాలు, నెలకు రూ.1.6 లక్షల జీతభత్యాలు కల్పిస్తున్నారన్నారు.
ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడానికి అడ్వకేట్ జనరల్ (ఏజీ) ఉండగా.. ప్రభుత్వశాఖలకు సలహాదారులను నియమించే ప్రశ్నే ఉత్పన్నం కాదని చెప్పారు. దేవాదాయ చట్ట నిబంధనల ప్రకారం సలహాదారుల నియామకానికి తావే లేదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. సలహాదారుగా శ్రీకాంత్ నియామకంపై స్టే ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.
లోతైన విచారణ చేపడతాం:అడ్వకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ కోర్టుకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేయబోగా ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ఇలాగే వదిలేస్తే రేపు మీకూ ఓ సలహాదారుణ్ని నియమిస్తారని ఏజీని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. ఈ మొత్తం వ్యవహారంపై లోతైన విచారణ చేపడతామని స్పష్టం చేసింది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, జ్వాలాపురపు శ్రీకాంత్‌కు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను అక్టోబరు 19కి వాయిదా వేసింది.
ఇవీ చదవండి: