రాజధాని అమరావతి చుట్టుపక్కల పలువురు భూములు కొనుగోలు చేశారని వెలగపూడి గ్రామానికి చెందిన సలివేంద్ర సురేశ్ అనే వ్యక్తి సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కె. శ్రీహాస, కె. రాజేశ్, నార్త్ పేస్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు తొట్టెంపూడి వెంకటేశ్వరరావు, సీహెచ్ తేజస్వీ, లలిత సూపర్ స్పెషాలిటీస్ ఆసుపత్రి ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్‌పై కేసు నమోదు చేశారు. తమపై నమోదైన కేసును రద్దు చేయాలని కోరుతూ వారు హైకోర్టులో మూడు వ్యాజ్యాలు దాఖలు చేశారు. జస్టిస్ టి. రజనీ బెంచ్ ముందుకు రెండు వ్యాజ్యాలు, మరో వ్యాజ్యం జస్టిస్ కె. లలిత వద్దకు విచారణకు వచ్చాయి. జస్టిస్ రజనీ తన ముందున్న వ్యాజ్యాల్ని, జస్టిస్ లలిత వద్దకు బదిలీ చేయగా ఆమె విచారణ జరిపారు.
ఫిర్యాదు చేసే అర్హత సురేశ్‌కు లేదు
లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి డైరెక్టర్ తరపు న్యాయవాది ఏకే కిశోర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ .. తాము రాజధాని సమీపంలో భూములు కొనుగోలు చేయలేదన్నారు. ఫిర్యాదులోనే ఎంత విస్తీర్ణం ఎక్కడ కొనుగోలు చేశామో పేర్కొనలేదన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసే అర్హత ఫిర్యాదుదారు సలివేంద్ర సురేశ్‌కు లేదన్నారు. ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయడం తగదని కోర్టుకు తెలిపారు. మిగిలిన పిటిషనర్ల తరపు న్యాయవాది ప్రణతి వాదనలు వినిపిస్తూ... భూములు విక్రయించిన వారికి అభ్యంతరం ఉంటే ఫిర్యాదు చేసే అర్హత ఉంటుందని స్పష్టం చేశారు. భూములతో సంబంధం లేదని సురేశ్ ఏవిధంగా ఫిర్యాదు చేస్తారని ప్రశ్నించారు. అతను ఎలాంటి మోసానికి గురికాలేదని పేర్కొన్నారు. ప్రైవేటు వ్యక్తుల మధ్య చోటు చేసుకున్న కొనుగోళ్లపై మూడో వ్యక్తి ఫిర్యాదు చేయలేరని కోర్టుకు స్పష్టం చేశారు. వ్యాపార నిర్వహణలో భాగంగా నార్త్ పేస్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ భూముల క్రయవిక్రయాలు నిర్వహించిందన్నారు. ప్రాథమిక ఆధారాలు లేకుండా పోలీసులు కేసు నమోదు చేశారని కోర్టుకు తెలిపారు.