ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చెరువు స్థలంలో ప్రభుత్వ భవనాలా? ఇలాంటి చర్యలను ఉపేక్షించబోమన్న హైకోర్టు - undefined

High Court serious on Government: ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.. నీటి వనరులను రక్షించాల్సిన ప్రభుత్వమే.. చెరువు స్థలంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేస్తామనడం ఏంటని ప్రశ్నించింది. ఇలాంటి చర్యలను చూస్తూ ఉపేక్షించబోమని స్పష్టం చేసింది.

high court
high court

By

Published : Jun 28, 2022, 9:52 AM IST

Secretariat construction in pond: చెరువు స్థలంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. నీటి వనరులను రక్షించాల్సిన ప్రభుత్వమే ఈ విధంగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించింది. చెరువు భూమిలో నిర్మాణాలు చేస్తామని చెబితే ఏ న్యాయస్థానమైనా అంగీకరిస్తుందా అని నిలదీసింది. ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. చెరువు స్థలంలో నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాన్ని తొలగించాలంటూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్‌ వేయడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నీటి వనరుల స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదంది. రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు, సరస్సులు, కుంటలు, నదులను ఆక్రమించి జరిపిన నిర్మాణాల విషయంలో తగిన ఉత్తర్వులిస్తామని తేల్చి చెప్పింది. ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను తనకు తానుగా (సుమోటో) ప్రజాహిత వ్యాజ్యంగా మార్చింది. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణను జులై 4కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలు గ్రామ పంచాయతీలోని సర్వేనంబరు 5341లోని ప్రభుత్వ భూమిలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధమని పేర్కొంటూ జి.వెంకటరమణ మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి వాటిని తొలగించాలని ఈ ఏడాది మే 5న ఉత్తర్వులిచ్చారు. ఆ తీర్పును సవాలు చేస్తూ అంపోలు గ్రామ పంచాయతీ కార్యదర్శి అప్పీల్‌ వేశారు. పంచాయతీరాజ్‌శాఖ తరఫు న్యాయవాది ఐ.కోటిరెడ్డి వాదనలు వినిపించారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆ భూమి చెరువు పోరంబోకుగా ఉందన్నారు. అక్కడ ప్రస్తుతం చెరువు లేదన్నారు. ప్రైవేటు వ్యక్తులు ఎప్పటి నుంచో ఇళ్లు నిర్మించుకున్నారని తెలిపారు. పాఠశాల, బస్సుషల్టర్‌, ఆసుపత్రి తదితర ప్రభుత్వ భవనాలను ఆ స్థలంలో నిర్మించారన్నారు. ఈ నేపథ్యంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం నిర్మాణానికి అనుమతివ్వాలని కోరారు. ఆ వాదనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం.. ప్రైవేటు వ్యక్తులు నిర్మించారని చెరువు స్థలంలో ప్రభుత్వం సైతం నిర్మాణాలు ఎలా చేస్తుందని నిలదీసింది. ప్రైవేటు వ్యక్తుల నిర్మాణాలను సైతం కూల్చాలని ఆదేశిస్తామని హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల ఆక్రమణల సంగతిని తేలుస్తామని ఈ వ్యవహారాన్ని సుమోటో పిల్‌గా మలిచింది.

ఇవీ చదవండి:

For All Latest Updates

TAGGED:

HIGH COURT

ABOUT THE AUTHOR

...view details