ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఏది ప్రజా ప్రయోజన వ్యాజ్యమో మాకు తెలియదా..?' - ఎమ్మెల్యే ఆర్కేపై హైకోర్టు కామెంట్స్

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామ పరిధిలో తెదేపా కార్యాలయం భూమి విషయంలో గతంలో ఓ వ్యాజ్యం దాఖలు చేసి... అదే అంశంపై మరో పిల్ ఎలా దాఖలు చేస్తారని వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డిని హైకోర్టు ప్రశ్నించింది. తాజాగా దాఖలు చేసిన పిల్​ను న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది. ఈ వ్యాజ్యంలో తదుపరి విచారణ జరపాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలో ప్రజాహితం ఉందని.. విచారణ జరపాలని ఎమ్మెల్యే తరపు న్యాయవాది అభ్యర్థించారు. ఏది ప్రజాహిత వ్యాజ్యమో.. ఏది రాజకీయ ప్రయోజన వ్యాజ్యమో తమకు తెలుసని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది.

high court serious comments MLA RK petition
హైకోర్టు

By

Published : Jul 24, 2020, 2:04 AM IST

గతంలో ఓ వ్యాజ్యం దాఖలు చేసి... అదే అంశంపై మరో పిల్ ఎలా దాఖలు చేస్తారని వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డిని హైకోర్టు ప్రశ్నించింది. తెదేపా కార్యాలయం భూమి విషయంలో పిటిషనర్​కు ఎందుకంత ఆసక్తి అని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది స్పందిస్తూ.. ఆ భూమిని ఎవరికి కేటాయించడానికి వీల్లేదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారు..? పిటిషనర్​కు మీరు అనుకూలమా అని ప్రశ్నించింది. పిల్​కు విచారణ అర్హత ఉందా..? లేదా..? అనే అంశంపై ముందు పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టును సంతృప్తి పరచనీయండని వ్యాఖ్యానించింది.

ఎమ్మెల్యే ఆర్కే తరఫు న్యాయవాది ఎ.రమేశ్ వాదనలు వినిపిస్తూ.. గతంలో సవాలు చేసిన అంశానికి, ప్రస్తుత అంశానికి సంబంధం లేదన్నారు. విచారణార్హతపై సంతృప్తి చెందాకే హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిందన్నారు. ఆ వాదనలపై సంతృప్తి చెందని ధర్మాసనం.. పిటిషనర్ 2017లో వేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు తోసిపుచ్చిందని గుర్తుచేసింది. ఇదే అంశంపై 2019లో దాఖలు చేసిన పిల్​పై తదుపరి విచారణ అవసరం లేదని తేల్చిచెప్పింది. తమ ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టును ఆశ్రయించొచ్చని పేర్కొంది.

హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ బి.కృష్ణమోహన్​తో కూడిన ధర్మాసనం వ్యాజ్యాన్ని పరిష్కరిస్తూ... ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామ పరిధిలో తెదేపా కార్యాలయ నిర్మాణానికి వాగు పోరంబోకుకు చెందిన 3.65 ఎకరాల్ని 99 ఏళ్లపాటు లీజు ప్రాతిపదికన కేటాయించారని పేర్కొంటూ... ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండీ... 'అలాంటి పరిస్థితి వస్తే మేం చూసుకుంటాం'

ABOUT THE AUTHOR

...view details